Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మహబూబాబాద్
విద్యారంగ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఎస్ఎఫ్ఐ ముందుకు సాగుతోందని ఆ సంఘం జిల్లా కార్యదర్శి కేలోత్ సాయికుమార్ తెలిపారు. ఆ సంఘం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని బాలుర జూనియర్ కళా శాల ఆవరణలో 52 ఆవిర్భావ దినోత్సవ వేడుకలు గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా సాయికుమార్ అతిథిగా హాజరై మాట్లాడారు. 1970లో 'అధ్యయనం-పోరాటం' నినాదంతో 'స్వాతంత్య్రం, ప్రజాస్వామ్యం, సోషలిజం' లక్ష్యాలతో సంఘం ఏర్పడిందని చెప్పారు. నాటి నుంచి విద్యారంగ సమస్యలపై సమరశీల పోరాటాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న తప్పుడు విధానాల వల్ల విద్యారంగంలో నెలకొంటున్న సమస్యల పై విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ పరిష్కార దిశగా పోరాటాలు నిర్మిస్తున్నట్టు తెలిపారు. తద్వారా విద్యార్థులను భావిభారత నేతలుగా తీర్చిదిద్దుతున్నట్టు చెప్పారు. విద్యార్థులను విద్యారంగంలో రాణించేలా ప్రోత్సహించడంలో భాగంగా పరీక్షల పట్ల ఉన్న భయాందోళనలు వీడేలా మోడల్ పరీక్షలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో మానుకోట డివిజన్ కార్యదర్శి సూర్యప్రకాష్, పట్టణ నాయకులు సాగర్, సింహాద్రి, రంజిత్, జయంత్, బాలికల విభాగం నాయకులు చాందిని, స్నేహ, మహేశ్వరి, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.