Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తాడ్వాయి
మేడారం జాతరకు వచ్చే సందర్శకులకు సకల సౌకర్యాలు కల్పించాలని రాష్ట్ర మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, సత్యవతి రాథోడ్ అధికారులను ఆదేశించారు. సందర్శకులను అతిథుల్లా భావించాలని వారు ఆకాంక్షించారు. మేడారం జాతర ఏర్పాట్లు, నిర్వహణపై మంత్రులు వివిధ శాఖల అధికారులతో మంత్రులు గురువారం సమీక్షించారు. జాతర పనులను ముమ్మరం చేయాలని, ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించుకోవాలని, పెండింగ్ పనులపై దృష్టి పెట్టాలని సూచించారు. గతంలో కంటే మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు అధికారులు చొరవ చూపాలన్నారు. గతంలో వచ్చిన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈసారి అలాంటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. తాగునీటి, పారిశుద్ధ్యం, వసతి, ఇతర సౌకర్యాలపై ప్రత్యేక దష్టి సారించాలని కోరారు. క్యూలైన్లు, బారికేడ్ల ఏర్పాటులో జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. కోవిడ్‌ను నిరోధించేలా సందర్శకులు నిబంధనలు పాటించేలా అధికారులు అవగాహన కల్పించాలని చెప్పారు. ప్రతిఒక్కరూ కొవిడ్ నిబంధనలు పాటించేలా వైద్యాధికారులు చర్యలు చేపట్టాలన్నారు. సందర్శకులకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని, స్నానఘట్టాల వద్ద అవసరమైన ఏర్పాట్లు చేయాలని కోరారు. రహదారులకు ఇరువైపులా సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఆర్ అండ్ బీ అధికారులను ఆదేశించారు. సందర్శకుల రధ్దీకి అనుగుణంగా ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేసి, పార్కింగ్ ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకొవాలని చెప్పారు. పోలీసు ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి సీసీ కెమెరాలతో జాతరను పర్యవేక్షించాలన్నారు. జాతర అనంతరం చెత్త తొలగింపుపైనా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, జనవరి 15లోగా పనులు పూర్తయ్యేలా ఆధికారులు పని చేయాలని చెప్పారు. జంపన్నవాగు వద్ద నిర్మించిన స్నానఘట్టాలను, షెడ్లను, ఇతర పనులను మంత్రులు పరిశీలించారు. తొలుత సమ్మక్క, సారలమ్మల గద్దెలను మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, సత్యవతి రాథోడ్ దర్శించారు. పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు ఆధ్వర్యంలో పూజారులు, ఎండోమెంట్ ఈఓ రాజేంద్రం ఆలయ సాంప్రదాయాల ప్రకారం డోలు వాయిద్యాలతో మంత్రులకు ఘనంగా స్వాగతం పలికారు. వనదేవతలకు పసుపు, కుంకుమ, చీర, సారె, బంగారం (బెల్లం) నూతన వస్త్రాలు సమర్పించి మొక్కులు చెల్లించారు. జంపన్నకు, సమ్మక్క సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు వనదేవతలకు ప్రత్యేక మొక్కులు చెల్లించారు. అనంతరం పూజారులు, ఎండోమెంట్ అధికారులు శాలువాలు కప్పి మంత్రులను సన్మానించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే సీతక్క, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్‌కుమార్, ములుగు జిల్లా కలెక్టర్ కష్ణ ఆదిత్య, ఎస్పీ సంగ్రామ్‌సింగ్, జెడ్పీ చైర్మెన్ కుసుమ జగదీష్, వైస్ చైర్పర్సన్ బడే నాగజ్యోతి, ఎంపీపీ గొంది వాణిశ్రీ, తదితరులు పాల్గొన్నారు.