Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్‌రెడ్డి
నవతెలంగాణ-టేకుమట్ల
రాష్ట్రంలో జరుగుతున్న రైతు ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలేనని కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు సుంకేట అన్వేష్‌రెడ్డి అన్నారు. మండలంలోని సుబ్బక్కపల్లి గ్రామానికి చెందిన సిద్ధి రవీందర్రావు, గుమ్మడవెల్లి గ్రామానికి చెందిన అక్కినపల్లి సారయ్య రైతులు ఇద్దరు ఇటీవల పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. బాధిత కుటుంబ సభ్యులను కాంగ్రెస్ ఆధ్వర్యంలో గురువారం పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కోటగిరి సతీష్‌గౌడ్ ఆధ్వర్యంలో గుమ్మడవెల్లి గ్రామంలో రైతులతో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ప్రకాష్‌రెడ్డి, జిల్లా నాయకులు గండ్ర సత్యనారాయణరావుతో కలిసి ఆయన పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ... రైతులు మద్దతు ధర లేక పురు గుల మందులు తాగి ఆత్మహత్యలు చేసుకుంటే వారి కుటుంబాలకు అండగా నిలవాల్సిన నాయకులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ధర్నా పేరుతో రైతులను మోసం చేస్తోందన్నారు. వడ్ల కొనుగోలులో క్వింటాలుకు 4 నుండి 5 కిలోల తరుగు పేరుతో రైతులను మిల్లర్లు మోసం చేస్తుంటే చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటన్నారు. కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక నల్ల చట్టాల రద్దు పోరాటంలో 750 మంది రైతులు అమరులయ్యారని, దీంతో కేంద్రం నల్ల చట్టాలను రద్దు చేసి రైతులకు క్షమాపణ చెప్పిందన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్కు అదే గతి పడుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన పోరాడుతుందన్నారు. వేసవిలో వరి వేస్తే కొనుగోలు చేయమని ప్రభుత్వాలు చెప్పడం దారుణమన్నారు. లక్షల కోట్లు ప్రజా నిధులతో ప్రాజెక్టులు కట్టి ఇప్పుడు పంటలు కొనమనడం సరికాదన్నారు. కాంగ్రెస్ హయాం లో రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టినట్టు గుర్తు చేశారు. ఆత్మహత్య చేసుకున్న కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిం చాలని, ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలన్నారు. రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బండ శ్రీకాంత్, కాంగ్రెస్ చిట్యాల మండల అధ్యక్షుడు గూట్ల తిరుపతి, మండల నాయకులు వైనాల రవీందర్, పెరుమాండ్ల లింగయ్య, మోతే రాజమౌళి, సంపత్, సదానందం, సుదర్శన్, కిష్టయ్య, కొమురయ్య పాల్గొన్నారు.