Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- హన్మకొండ
అకాల వర్షాలతో పంట నష్టపోయిన మిర్చి, మొక్కజొన్న, కూరగాయలు, మామిడి రైతులను నేషనల్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ చట్టం కింద వెంటనే ఆదుకోవాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్ మోర్తాల చందర్ రావు డిమాండ్ చేశారు. బుధవారం తెలంగాణ రైతు సంఘం, యూపీ తెలంగాణ రైతు స్వరాజ్య వేదిక ఆధ్వర్యంలో వరంగల్ కలెక్టర్ కార్యాలయంలో అడిషనల్ కలెక్టర్ హరిసింగ్‌కు ఆయన వినతిపత్రం అందజేసి మాట్లాడారు. ఇటీవల జరిగిన అకాల వర్షాలు, వడగళ్ల వాన వంటి ప్రకతి వైపరీత్యాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. వారికి వెంటనే నేషనల్ డిజాస్టర్ చట్టం క్రింద మిర్చి పంటకు ఎకరాకు లక్ష రూపాయలు, మొక్కజొన్న, మామిడి, కూరగాయ రైతులకు ఎకరాకు 50వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలన్నారు. 2020 అక్టోబర్ నెలలో కురిసిన వర్షాలతో దెబ్బతిన్న రైతాంగానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 185 కోట్ల రూపాయలకు రాష్ట్ర ప్రభుత్వం తన వాటాను కలిపి రైతులకు వెంటనే పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. గుజరాత్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల మాదిరిగా తెలంగాణలో కూడా అన్ని పంటలకు పటిష్టమైన పంటల బీమా పథకాలు అమలు చేయాలన్నారు. పంట నష్టం పరిహారాలు వాస్తవ సాగు దారులైన కౌలు రైతులకు, పోడు రైతులకు నేరుగా అందించాలన్నారు. తక్షణమే ప్రభుత్వం హామీ ప్రకారం లక్ష రూపాయల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి రాష్ట్ర నాయకులు రాములు తదితరులు పాల్గొన్నారు.