Authorization
Mon Jan 19, 2015 06:51 pm
స్థానికత, సీనియార్టి ఆధారంగా విభజించాలి
టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం
నవతెలంగాణ-హన్మకొండ
317జీఓను రద్దు చేసి స్థానికత ఆధారంగా విభజన చేయాలని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ డిమాండ్ చేశారు. బుధవారం ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో హన్మకొండలోని భద్రుక డిగ్రీ కాలేజీ '317 జీఓ వల్ల ఉత్పన్నమైన సమస్యలు వాటి పరిష్కార మార్గాలు' అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఆ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ముత్యాల రఘుపతి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ ఉద్యమానికి స్థానికత ఆత్మని చెప్పారు. ఆ ఆత్మ కోల్పోయిన 317జీఓను నిర్ద్వంద్వంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. ఈ జీవోను ప్రభుత్వం వెంటనే రద్దు చేసి బాధిత ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. శాస్త్రీయత లేకుండా జిల్లాలు ఏర్పాటు చేయడంతో సమస్యలు ఉత్పన్నమవుతాయన్నారు. ఈ జీఓ ప్రజాస్వామిక సాంప్రదాయానికి విఘాతం కలిగిస్తోందని విమర్శించారు. జిల్లాల వారీగా పోస్టుల విభజన, ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల విభజన శాస్త్రీయంగా జరగలేదన్నారు. సీనియార్టీ జాబితాలను బహిర్గతం చేయకపోవడంతో వేలాది మంది ఉపాధ్యాయులకు నష్టం వాటిల్లిందన్నారు. ప్రభుత్వం సూపర్ న్యూమరీ పోస్టులు సష్టించి సమస్యలు పరిష్కరించాలని కోరారు.
బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ మాట్లాడుతూ.. రైతులు, విద్యార్థులు, కార్మికులు, నిరుద్యోగులు బాధలో ఉన్నారని ప్రభుత్వం 317జీఓ తెచ్చి ఉపాధ్యాయుల, ఉద్యోగుల జీవితాలలో చీకట్లు తెచ్చిందని మండిపడ్డారు. ప్రభుత్వం 317 జీవోను రద్దు చేసేంతవరకు బాసటగా నిలుస్తామన్నారు. టీపీటీఎఫ్ రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి నన్నెబోయిన తిరుపతి మాట్లాడుతూ.. జిల్లా అల్లొకేషన్లో స్పౌజు కేటగిరీకి ప్రాధాన్యత ఇవ్వకపోవడం వల్ల భార్య భర్తలు వేర్వేరు జిల్లాలకు కేటాయించబడ్డారని వాపోయారు. ప్రభుత్వం వేర్వేరు జిల్లాల్లో పనిచేస్తున్న భార్యా,భర్తలను ఒకే జిల్లాలో పని చేసేటట్లుగా మార్గదర్శకాలు విడుదల చేయాలన్నారు. 317జీఓతో సమతుల్యత దెబ్బతిని భవిష్యత్తులో ఆదివాసీ, మారుమూల జిల్లాలలో నిరుద్యోగ సమస్య ఎక్కువవుతుందన్నారు. ఉపాధ్యాయుల నుంచి వచ్చిన అభ్యంతరాలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించి బాధిత ఉపాధ్యాయులకు న్యాయం చేసేంతవరకు టీపీటీఎఫ్ పోరాడుతుందన్నారు. ఈ సమావేశంలో టీపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రావుల రమేష్, సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ జిల్లా అధ్యక్షుడు అప్పారావు, మానవ హక్కుల సంఘం ఉమ్మడి జిల్లా బాధ్యులు హరికిషన్, రాజ మల్లయ్య, జయ ప్రకాష్, టీజేఎస్ నాయకులు శివాజీ, టీఎస్యూటీఎప్ బాధ్యులు రవీందర్ రాజు, వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.