Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
మేడారం జాతర సమీపిస్తుంటే రోడ్డు పనుల్లో నిర్లక్ష్యం రాజ్యమేలుతోంది. జాతీయ రహదారి 163 వరంగల్-ములుగు మధ్య కటాక్షపూర్ చెరువు లోయర్ కాజ్వేపై బిటి పూర్తిగా దెబ్బతిని రాకపోకలకు ఇబ్బందికరంగా పరిణమించింది. ఫిబ్రవరి 16వ తేదీన జాతర ప్రారంభం కావాల్సి ఉన్నా ఇప్పటికే ముందస్తు గా ప్రజలు మేడారం జాతరకు వెళ్లి వస్తున్నారు. ఈ క్రమంలో రహదారుల మరమ్మతుల్లో అధికారులు తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శించడం గమనార్హం. జాతర ముంచుకొస్తున్నా రహదా రులు, భవనాల శాఖ అధికారులు నిర్లక్ష్యంతో నేటికీ పనులు పూర్తి కాలేదు. నగరంలో ములుగు రోడ్డు నుంచి ములుగు వైపుకు వెళ్లే జాతీయ రహదారిలో ఆరేపల్లి వద్ద రోడ్డు ధ్వంసమై రాకపోకలకు తీవ్ర అంతరాయంగా పరిణమించింది. ఈ రహదారిపై మంత్రులు మేడారం వరకు వెళ్లి జాతర ముందస్తు ఏర్పాట్ల ను సమీక్షిస్తున్నా, ఈ రోడ్డు మరమ్మతులు చేయడంలో తీవ్ర నిర్లక్ష్యం వహించారు. తాజాగా ఆరేపల్లి ప్రాంతంలో రోడ్డు పనులు చేస్తున్నా, కటాక్షపూర్ వద్ద రోడ్డు మరమ్మతులు నేటికీ చేపట్టకపోవడం గమనార్హం. కోవిడ్ నేపథ్యంలో మేడారం జాతర ప్రారంభానికి ముందుగా గత రెండు నెలల నుండి పెద్ద ఎత్తున ప్రజలు మేడారానికి తరలివెళ్తున్నారు. ఈ విషయం తెలిసినా ఆర్ అండ్ బి అధికా రులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. జాతీయ రహదారుల అధికారుల నిర్లక్ష్యం వాహనదారులకు తీవ్ర ఇబ్బందికరంగా పరిణమించింది. ఇప్పటికైనా కటాక్షపూర్ వద్ద రహదారిని పునర్నిర్మించాలని కోరుతున్నారు. మేడారానికి వెళ్తున్న ప్రజల సౌకర్యార్ధం వెంటనే జాతీయ రహదారుల అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.