Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నర్సింహులపేట
పంచాయతీ కార్యదర్శి ఉద్యోగం ముండ్ల కిరీటంలా తయా రైందన్న వ్యాఖ్యలు వినవస్తున్నాయి. అధికారులు విధించే టార్గెట్లు, పంచాయతీ పాలకవర్గం పెత్తనంతో కార్యదర్శులు ఇబ్బంది పడు తున్నారు. విధి నిర్వహణలో తీవ్ర ఒత్తిళ్లతో సతమతమవుతున్నారు. పంచాయతీల్లో అన్ని పనులకు కార్యదర్శులే బాధ్యత వహించాల్సి వస్తోంది. రెగ్యులర్ విధులతోపాటు పల్లె ప్రగతి పనులను పర్యవేక్షిం చాలి. ఉపాధి హామీ పనులకు కూలీలు రాకపోయినా వారికే ఇబ్బంది.
మండలంలోని 22 గ్రామ పంచాయతీలకు గాను 17 మంది కార్యదర్శులు, ఐదుగురు ఇన్చార్జిలు పని చేస్తున్నారు. ఇటీవల కొత్త నిబంధన ప్రకారం వారిపై బాధ్యతలు పెరిగాయి. గతంలో పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం కార్యదర్శులు గ్రామాల్లో పన్నుల వసూళ్లు, పారిశుద్ధ్య పనులు, రికార్డుల నిర్వహణ చేయాల్సి ఉంది.
ఉదయమే ఆన్లైన్లో హాజరు
పంచాయతీ కార్యదర్శి ఉదయం ఏడు గంటల నుంచే గ్రామపంచాయతీకి వెళ్లి జీపీఎస్‌లో హాజరు నమోదు చేయాలి. ఆన్లైన్ సంబంధిత జీపీఎస్ నుంచి కేవలం కిలోమీటర్ లోపు మాత్రమే ఫోటో అప్లోడ్ చేసే వీలుంది. ఈ నిబంధన కార్యదర్శులకు మింగుడు పడటం లేదు. మండల కేంద్రం నుంచి పంచాయతీలకు వెళ్లాలంటే తప్పనిసరిగా బైక్ వినియోగించాల్సిందే. దీంతో మహిళా కార్యదర్శులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నిబంధనను మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఆన్లైన్లో హాజరు వేశాక రోడ్లు, డ్రెయినేజీలు, పారిశుద్ధ్య పనులు పర్యవేక్షిస్తున్నట్లు మరిన్ని ఫోటోలు అప్లోడ్ చేయాలి. అనంతరం స్మశాన వాటిక, నర్సరీలు సందర్శించి ఫోటోలు అప్లోడ్ చేయాలి. అలాగే ఇంటింటికి వెళ్లి చెత్త సేకరణ చేసే కార్మికులతో ఫొటో దిగి ఆన్లైన్లో పెట్టాలి. ఉపాధి హామీ పనుల్లోకి ఎందరు కూలీలు వచ్చారనేది నమోదు చేయాలి. అంతేకాకకరోనా వ్యాక్సినేషన్‌ను పర్యవేక్షించాలి. మరోవైపు అధికారులు ఎప్పుడు ఏ సమాచారం అడుగుతారో తెలియక సతమతమవుతున్నారు. ఇవి మాత్రమే కాకుండా అధికారులతో సమీక్షలు, వీడియో, సెల్ కాన్ఫరెన్స్‌లు అదనం. విధినిర్వహణలో ఏ అంశంలోనూ వెనుకబడినా శ్రీముఖాలు (నోటీసులు) అందుతాయి. ఈ క్రమంలో పంచాయతీ కార్యదర్శులు మానసికంగా కుంగిపోతున్నారు. ఒత్తిళ్లు తగ్గించాలని కోరుతున్నారు.