Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జనగామ
జిల్లాలో అర్హులందరికి దళితబంధు పథకం అందేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభి వృద్ధి, మంచినీటి సరఫరాశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఫీవర్ సర్వే, దళితబంధు, పంట నష్టపరిహారంపై కలెక్టర్ సీిహెచ్ శివలింగయ్య ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గ ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తాటికొండ రాజయ్య, జెడ్పీ చెర్మెన్ సంపత్ రెడ్డి, జనగామ మున్సిపల్ చైర్పర్సన్ జమున, జిల్లా అధికారులతో సమీక్షించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ఆశాలు ఏఎన్ఎంలు పంచాయతీ సెక్రటరీలు ప్రతిరోజు కరోనా బాధితుల వివరాలు తెలుకుని తగిన వైద్యం అందజేయాల న్నారు. మేడారం జాతరకు సందర్శకుల రాకపోకలు పెరిగి నందున కోవిడ్ టెస్టులు పెంచుతూ పటిష్ట చర్యలు తీసుకో వాలన్నారు. ఇప్పటికే వివాహ వేడుకలు నియంత్రించామని, ధర్నాలు, సభలు, సమావేశాలు జరగకుండా పోలిస్‌శాఖ చర్యలు తీసుకోవాలన్నారు. మాస్క్ లేని వారికి జరిమానా విధిస్తూ విస్తృత ప్రచారం చేపట్టాలన్నారు. రెండవ డోసు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ సిలండర్లు, మందులు ముందస్తుగా సిద్ధం చేసుకో వాలన్నారు. అత్యవసర సమయాల్లో యుద్ధ ప్రాతిపదికన సేవలందించే ఉద్యోగుల ఖాళీలను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. రూ.1.50 లక్షల కోట్లతో చేపట్టే దళిత బంధు పథకం అమలులో రాష్ట్రంలోనే జనగామ అగ్రస్థానంలో నిలపాలన్నారు. ప్రతి నియోజకవర్గం నుండి వంద మంది లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా చేపట్టాల న్నారు. మూడేండ్లలో ప్రతి అర్హుడికి దళిత బంధు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఫిబ్రవరి 5 కల్లా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. ఎంపిక చేసిన వారికి సాంకేతిక పరంగా వ్యాపారాల్లో శిక్షణ ఇవ్వాలని యూనిట్లు నెలకొల్పేందుకు ఆసక్తిగల పథకాలనే మంజూరు చేయాల న్నారు. అనంతరం ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మాట్లాడుతూ జిల్లాలో 64 వేల కుటుంబాలు ఉన్నాయని, వారి జీవన స్థితిగతులు మెరుగుపరచడానికి చర్యలు తీసుకోవాలన్నారు ప్రతి యూనిట్ లో నైపుణ్య శిక్షణ ఇస్తూ బాసటగా నిలవాల న్నారు. అనంతరం స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే రాజయ్య మాట్లాడుతూ.. మాణిక్యపురం నవాబుపేట వంటి గ్రామా ల్లో తక్కువ మంది ఉన్నందున ఆయా గ్రామాలను ఎంపిక చేయాలన్నారు. పల్లె నిద్రలో భాగంగా దళితవాడలో పర్యటించి వారి జీవన స్థితిగతులపై అధ్యయనం చేశా మన్నారు. విద్యావంతులను ఎంపిక చేయగలిగితే దళిత బంధు మరింత ముందుకు పోతుందన్నారు. జనగామ నియోజకవర్గ ఎమ్మెల్యే యాదగిరిరెడ్డి మాట్లాడుతూ.. దళిత బంధును అంచెలంచెలుగా ప్రతి ఒక్కరికి అందించే లా అధికారులు కృషి చేయాలన్నారు. కలెక్టర్ శివలింగయ్య మాట్లాడుతూ.. ఫీవర్ సర్వే రోజువారిగా సమీక్షిస్తున్నట్టు తెలిపారు. పరిహారంపై నివేదికలు తెప్పించమని ప్రభుత్వా నికి నివేదిస్తామన్నారు. దళితబంధును పటిష్టంగా అమలు పరిచేందుకు పక్కా ప్రణాళిక రూపొందించామని అన్నారు. నియోజకవర్గాల వారీగా నోడల్ అధికారులను నియమిం చామని, ఐదో తేదీ లోపు అర్హులను గుర్తించి నివేదిక అంద జేస్తామన్నారు. అదనపు కలెక్టర్లు అబ్దుల్ హమీద్, భాస్కర్, ఆర్డీఓలు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.