Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తొర్రూరు
సర్కారు బడుల్లో కనీసం ఊడ్చేందుకు, గంట కొట్టేందుకు సైతం అటెండర్లు లేని పరిస్థితి నెలకొంది. మూత్రశాలలు, మరుగుదొడ్లు శుభ్రం చేసే స్కావెంజర్లు లేరు. పలు చోట్ల మరుగుదొడ్లు, మూత్రశాలలు లేక విద్యార్థులు బడి సమయంలోనూ ఇంటికి పరుగు పెట్టాల్సిన దుస్థితి ఉంది. తరగతి గదులు శిథిలావస్థకు చేరి పెచ్చులూడుతున్నాయి. అవి ఎప్పుడు కూలుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. విద్యార్థులు సరిపడా ఉన్న చోట ఉపాధ్యాయులు ఉండరు. ఉపాధ్యాయులు ఉన్నచోట విద్యార్థులు ఉండరు. సవాలక్ష సమస్యలతో సర్కారు బడులు ఉనికి కోల్పోతున్నాయి. ఏటా ప్రభుత్వ బడుల సంఖ్య తగ్గుతోంది. అయితే కరోనా మూలంగా ప్రయివేట్ పాఠశాలల్లో ఫీజులు చెల్లించలేక పలువురు పిల్లలను సర్కారు బడుల్లో చేర్పిస్తుండడంతో ఈ ఏడాది విద్యార్థుల సంఖ్య పెరిగింది. కానీ వసతులు లేక ఇబ్బంది తప్పడం లేదు. ఇలాంటి సమయంలో ప్రభుత్వం సర్కారు బడులపై దష్టి పెట్టడంతో బడి నసీబ్ మారుతుందన్న ఆశలు చిగురిస్తున్నాయి. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు ఏటా ఇచ్చే నిధుల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాల కల్పనకు 40 శాతం వెచ్చించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. ఆ నిధులతో కొంతైనా మౌలిక సదుపాయాలు కలుగుతాయని భావిస్తున్నారు. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వ పాఠశాలల్లో వసతుల కల్పనపై చర్చ జరిగింది. 'మన ఊరు మన బడి' కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయం తీసుకోవడంతో బడుగులకు మంచిరోజులు రావచ్చన్న ఆశలు చిగురించాయి. బడుల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కావాల్సిన నిధులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనితో కొంతమేర మార్పు వస్తుందని భావిస్తున్నారు.
ఆంగ్ల మాధ్యమం అమలుపై దృష్టి
ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. మారుతున్న కాలానికి అనుగుణంగా పేద, మధ్య తరగతి ప్రజలు తమ పిల్లలను ఇంగ్లీష్ మీడియం కోసం ప్రైవేటు పాఠశాలలకు పంపుతున్నారు. అడ్డగోలు ఫీజులు భరించి అయినా కష్టపడి చదివిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే ఇంగ్లీష్ మీడియం అమలైతే వారంతా తమ పిల్లల్ని సర్కారు బడికి పంపించే అవకాశం ఉంది.