Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గోవిందరావుపేట
మేడారం మహా జాతర ఉత్సవ కమిటీ నుంచి గిరిజనేతరులను తొలగించాలని తుడుందెబ్బ జాతీయ కన్వీనర్ రమణాల లక్ష్మయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండలంలోని పసర గ్రామంలో జిల్లా అధ్యక్షుడు చింతా కృష్ణ అధ్యక్షతన సోమవారం నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి లక్ష్మయ్య, కోకన్వీనర్ పొదెం రత్నం, రాష్ట్ర అధ్యక్షుడు వట్టం ఉపేందర్ హాజరై మాట్లాడారు. మేడారం ఆదివాసీ జాతర అయిన నేపథ్యంలో ఉత్సవ కమిటీలో గిరిజనేతరులను చేర్చి అనాదిగా వస్తున్న గిరిజన సంప్రదాయాలను మనోభావాలను దెబ్బతీస్తున్నారని చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం గిరిజనుల మనోభావాలను సంస్కతి సంప్రదాయాలను గౌరవించి గిరిజనేతరులకు ఉత్సవ కమిటీ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. అనంతరం పసర చౌరస్తాలోని కొమరం భీమ్ విగ్రహం వద్ద మేడారం ఉత్సవ కమిటీ నుంచి గిరిజనేతరులను తొలగించాలని నినాదాలు చేశారు. కార్యక్రమంలో తుడుందెబ్బ నాయకులు వట్టం సురేష్, జివాజీ రవి, చింత వెంకటేష్, ప్రసాద్, అల్లెం అశోక్, తదితరులు పాల్గొన్నారు.