Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సుబేదారి
టీఆర్ఎస్ ప్రభుత్వం విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తోందని ఏఐఎఫ్డీఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి మాస్ సావిత్రి అన్నారు. గురువారం ఏఐఎఫ్డీఎస్ ఆధ్వర్యంలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతుకు వినతిపత్రం అందజేశారు. అనం తరం ఆమె మాట్లాడుతూ.. హైస్కూల్ స్థాయి నుంచి యూనివర్సిటీ స్థాయి వరకు షిఫ్ట్ వైజ్‌గా ఆఫ్‌లైన్ తరగతులు నిర్వహించాలన్నారు. ఎందరో విద్యార్థుల ఆత్మ బలిదానాలతో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం విద్యావ్యవస్థ ను నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. కరోనా నేపథ్యంలో ఇప్పటికే 17నెలలు విద్యాసంస్థలు మూసి వేసినట్టు తెలిపారు. మళ్లీ ఒమిక్రాన్ పేరుతో విద్యాసంస్థలు మూసివేయడం ద్వారా పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు తీవ్ర నష్టం జరుగుతుం దన్నారు. అందువలన హైస్కూల్ స్థాయి నుంచి ప్రత్యక్ష తరగతులు ప్రారంభించాలన్నారు. అదే విధంగా పెండిండ్ స్కాలర్షిప్స్, ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని, హాస్టల్ విద్యార్థులకు మెస్, కాస్మోటిక్ చార్జీలు పెంచాలన్నారు. ప్రైవేటు యూనివర్సిటీలు రద్దుచేసి, ప్రభుత్వ యూనివర్సిటీలకు అధిక నిధులు కేటాయించాలన్నారు. కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్య వెంటనే ప్రారంభించాలని, తక్షణమే మహిళా యూనివర్సిటీని ప్రారంభించాలన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని, కరోణ సమయంలో ఉపాధి కోల్పోయిన ప్రైవేట్ ఉపాధ్యాయులను ఆదుకోవాలని, 2018 ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, తక్షణమే జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు జన్ను రమేష్, జిల్లా కమిటీ సభ్యులు కొండా ప్రణరు, ఇటుకల సాయిరాం గూడ సాయి వర్మ తదితరులు పాల్గొన్నారు.