Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వ్యాగన్ రిపేరు వర్క్‌షాపు పనులు చేపట్టాలి
అఖిలపక్ష నాయకులు
నవతెలంగాణ-కాజీపేట
కాజీపేట రైల్వే స్టేషన్ అభివృద్ధికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిధులు కేటాయించాలని అఖిలపక్షం నాయకులు డిమాండ్ చేశారు. గురువారం కాజీపేట రైల్వే సమస్యలపై ఆల్ ట్రేడర్స్ అసోసియేషన్, కాజీపేట వర్తక సంఘం ఆధ్వర్యంలో స్థానిక పారడైజ్ ఫంక్షన్ హాల్లో అఖిలపక్ష నాయకులు, ప్రజా సంఘాల, రిటైర్డ్ ఉద్యోగులు, రైల్వే అనుబంధ సంస్థల ప్రజాప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్యే దాస్యం వినరు భాస్కర్, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎం చుక్కయ్య, జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జంగా రాఘవరెడ్డిలు ముఖ్యఅతిథులుగా హాజరై మాట్లాడారు. కాజీపేటకు రైల్వే పరంగా అన్ని విధాల నష్టం జరుగుతుందన్నారు. కాజీపేటకు మంజూరైన వ్యాగన్ రిపేర్ వర్క్ షాప్ పనులను వెంటనే చేపట్టాలన్నారు. వ్యాగేన్ రిపేర్ వర్క్‌షాప్‌కు అవసరమైన 150 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం రైల్వే శాఖకు అప్పగించిన.. కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. ఇచ్చిన హామీ ప్రకారం కాజీపేటలో కేంద్ర ప్రభుత్వం కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటునకు నిధులు మంజూరు చేసి యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. రానున్న బడ్జెట్లో కాజీపేటకు నిధులు కేటాయించక పోతే పోరాటాలకు సిద్ధమవుతామనాన్నరు.
కాజీపేటను రైల్వే డివిజన్‌గా ఏర్పాటు చేసి, ఎలక్ట్రికల్ పీఓహెచ్ షెడ్ నిర్మాణం చేయాలన్నారు. బొడ గుట్ట ఫుట్ఓవర్ బ్రిడ్జి నిర్మాణేం చేపట్టాలన్నారు. ఎలక్ట్రికల్ ట్రాక్షన్ ట్రైనింగ్ సెంటర్ నిర్మాణం చేపట్టి ఉద్యోగులకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ప్రతి ఏటా రైల్వే బడ్జెట్లో కాజీపేట ప్రాంతానికి కేంద్ర ప్రభుత్వం నిరాశనే మిగిల్చిందని.. రానున్న బడ్జెట్లో కాజీపేట ప్రాంతాన్ని రైల్వే పరంగా అన్ని విధాలా అభివద్ధి చెందేలా బడ్జెట్‌ను కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు జక్కుల రవీందర్ యాదవ్, విజయ శ్రీ రాజాలి, సంకు నర్సింగ్ రావు, ఎలాకంటి రాములు, 47 వ డివిజన్ కాంగ్రెస్ కాంటెస్ట్ కార్పొరేటర్ అభ్యర్థి సందేల విజరు కుమార్, సీపీఐ నాయకులు మేకల రవి, న్యూ డెమోక్రసీ నాయకులు అప్పారావు, రైల్వే మజ్దూర్ యూనియన్ నాయకులు కాల్వ శ్రీనివాస్, పాక వేద ప్రకాష్, సంఫ్‌ు నాయకులు తదితరులు పాల్గొన్నారు