Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కోల్బెల్ట్
సింగరేణి కార్మికుల ఉద్యోగ విరమణ వయస్సును 61 ఏండ్లకు పెంచడాన్ని తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం వ్యతిరేకిస్తున్నట్టు రాష్ట్ర కన్వీనర్ కామెర గట్టయ్య తెలిపారు. రీజినల్ లేబర్ కమిషనర్ సమక్షంలో సింగరేణి అధికారుల, టీబీజీకేఎస్, ఏఐటీయూసీ, సీఐటీయూ, హెచ్ఎంఎస్, ఐఎన్టీయూసీ, విప్లవ కార్మిక సంఘాలు నాయకుల సమావేశంలో గట్టయ్య మాట్లాడారు. కార్మికుల ఉద్యోగ విరమణ వయస్సు పెంచడాన్ని టీఎస్యూఎస్ కార్మిక సంఘం తప్పు పట్టిందన్నారు. అండర్ గ్రౌండ్లో ప్రకృతికి విరుద్ధంగా విధులు నిర్వహిస్తున్న కార్మికులు షుగర్, బీపీ, గుండెజబ్బులు, తదితర రోగాలతో డ్యూటీ సక్రమంగా చేయలేకపోతున్నారని చెప్పారు. సింగరేణి ప్రాంతంలో 50 భూగర్భ గనులు తవ్వి కోల్బెల్ట్ ప్రాంతంలో 1.50 లక్షల మంది కార్మికుల పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని స్వరాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో ఇచ్చిన హామీని సీఎం కేసీఆర్ అమలు చేయాలని, సింగరేణి మెడికల్ బోర్డులో అవినీతిని అరికట్టాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని సమావేశానికి హాజరైన పర్సనల్ ఆనందరావు ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి లిఖితపూర్వకంగా వినతిపత్రం పంపించారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు దాసరి జనార్ధన్ పాల్గొన్నారు.