Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బయ్యారం
తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల, యువత ఆత్మహత్యల పరంపర కొనసాగుతుందని, నాడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం నేడు ఉద్యోగ నోటిఫికేషన్ కోసం విద్యార్థులు తమ ప్రాణాలను బలిదానం చేస్తున్నారని మాజీ మంత్రి, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. మండల కేంద్రానికి చెందిన నిరుద్యోగి ముత్యాల సాగర్ ఉద్యోగ నోటిఫికేషన్ రావడంలేదని మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న సాగర్ కుటుంబాన్ని శుక్రవారం ఆయన పరామర్శించి, రూ. 50 వేల ఆర్థిక సహాయం అందించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం విద్యార్థులు ఎంతో మంది ఆత్మబలిదానాలు చేసుకున్నారని, నేడు ఉద్యోగ నోటిఫికేషన్లు రాకపోవడంతో మరల ఆత్మబలిదానాలు పెరుగుతున్నాయన్నారు. ఏడు సంవత్సరాలుగా అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం నేటికీ ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వకపోవడం సిగ్గుచేటన్నారు. విద్యార్థులు ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని, అమ్మానాన్నలు కన్న కలలను కలలుగానే చరిపెయవద్దన్నారు. కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా అవసరమైతే తెలంగాణ రాష్ట్రంలోని బయ్యారంలో ఉక్కు పరిశ్రమ నెలకొల్పడానికి రాష్ట్ర ప్రభుత్వం వెనుకాడబోమని కేటీఆర్ ఇచ్చిన హామీ ఏమైందని ఆయన ప్రశ్నించారు. తక్షణమే ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. అనంతరం అనారోగ్యంతో బాధపడుతున్న మండల కేంద్రానికి చెందిన టీఆర్ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు రెంటాల బుచ్చిరెడ్డిని పరామర్శించారు. మండల పరిధిలోని ఉప్పలపాడు గ్రామ పంచాయతీకి చెందిన బీజేపీ మాజీ మండల అధ్యక్షుడు రాసాల లింగయ్య మృతి చందడంతో వారి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షులు జాటోత్ హుస్సేన్ నాయక్, జిల్లా అధ్యక్షులు మద్దిరాజు రామచంద్రయ్య, మండల అధ్యక్షుడు ఈసం వెంకటేశ్వర్లు, జిల్లా యువజన నాయకులు రాసాల నరేష్, విహెచ్ పిఎస్ జిల్లా నాయకులు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.