Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గోవిందరావుపేట
మండలంలోని పసర పంచాయతీ మేడారం రహదారిలో ఆర్చి నుంచి రహదారి విస్తరణ చేపడతామని శుక్రవారం పంచాయతీ సిబ్బంది వ్యాపారుల దుకాణాల ముందున్న రేకుల తొలగించేందుకు రావడంతో పరిస్థితి రసాభాసగా మారింది. ఆర్ అండ్ బీ శాఖ డీఈ రఘువీర్, సర్పంచ్ ముద్దరబోయిన రాము దుకాణాల ముందున్న రేకులు తొలగించాలని వ్యాపారులతో చెప్పారు. రహదారి ఇరుకుగా ఉండడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, వర్షం కురిస్తే నీరు నిల్వకుండా డ్రెయినేజీ పనులు చేపడతామని ఆయన తెలిపారు. ఇప్పటికిప్పుడు రేకుల సముదాయాన్ని తొలగిస్తే ఎలా అని వ్యాపారులు లబోదిబోమన్నారు. మరో 15 రోజుల్లో జాతర ఉండగా ఇప్పటికే సరుకు తెచ్చుకున్నామని, ఈ పరిస్థితుల్లో రహదారి విస్తరణ పేరుతో డిస్టర్బ్ చేస్తే వ్యాపారం దెబ్బతింటుందని వారు వాపోయారు. రెండేండ్లకోసారి జరిగే మేడారం మహాజాతర సందర్భంగా వ్యాపారం ద్వారా కొంత లాభం చేకూరుతుందని ఆశతో ఇంతకాలం ఉన్నామని వ్యాపారులు తెలిపారు. జాతర తర్వాత విస్తరణ పనులు చేపడితే సహకరిస్తామని వారన్నారు. జాతర అయిపోయే వరకు సమయం కావాలని వ్యాపారస్తులు, వీలుకాదని సర్పంచ్ పట్టుబట్టడంతో పోలీసులు రంగప్రవేశం చేయాల్సి వచ్చింది. ఇరువర్గాలను పోలీసులు సముదాయించారు. సర్పంచ్‌తోపాటు అధికారులు కూడా జాతర వరకు సహకరించి ఆదుకోవాలని కోరారు. అంతటితో గొడవ సద్దుమణిగి ఎవరి దారిన వారు వెళ్లిపోయారు.