Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు వట్టం ఉపేందర్
నవతెలంగాణ-ములుగు
ఈనెల 29న తలపెట్టిన మేడారం ట్రస్ట్ బోర్డ్ కార్యవర్గ ప్రమాణస్వీకారంలో జిల్లాకు సమ్మక్క-సారలమ్మగా నామకరణం చేయాలని తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు వట్టం ఉపేందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని ఎస్సీ కాంప్లెక్స్‌లో జిల్లా సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు, ప్రజాసంఘాల జేఏసీ చైర్మెన్ ముంజాల భిక్షపతి అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన ప్రజాసంఘాల, ఎమ్మార్పీఎస్ సమావేశానికి ఉపేందర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మేడారం ట్రస్ట్ బోర్డ్ ప్రమాణస్వీకారం చేయనున్న క్రమంలో అనేక ఏండ్లుగా అమలుకు నోచుకోని జిల్లా పేరు మార్పిడి సమస్యకు పరిష్కారం లభించాలని ఆకాంక్షించారు. ఇతర జిల్లాలకు ప్రజాభీష్టం మేరకు పేర్లు మార్చిన రాష్ట్ర ప్రభుత్వం ములుగు పట్ల వివక్ష చూపడం సరికాదన్నారు. నేటి ట్రస్ట్ బోర్డ్ ప్రమాణస్వీకారం సందర్భంగా మంత్రులు ఆల్లోల్ల ఇంద్రకరణ్‌రెడ్డి, సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, జెడ్పీ చైర్మెన్ జగదీష్ కలిసి స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మార్పీఎస్ ములుగు నియోజకవర్గ ఇన్‌ఛార్జి నెమలి నర్సయ్య మాట్లాడుతూ సీఎం కేసీఆర్ జిల్లా పట్ల మోసపూరితంగా వ్యవహరిస్తున్నాడని విమర్శించారు. తుడుందెబ్బ జాతీయ కన్వీనర్ రమణాల లక్ష్మయ్య మాట్లాడుతూ ఆసియా ఖండంలోనే అతిపెద్ద మహాజాతరగా పేరొందని మేడారం పట్ల నిర్లక్ష్యం చేస్తే తగిన రీతిలో గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. సమావేశంలో ప్రజాసంఘాల, ఎమ్మార్పీఎస్ నాయకులు బొమ్మకంటి రమేష్ వర్మ, సామర్ల గణేష్, శ్రీను, భద్రయ్య తదితరులు పాల్గొన్నారు.