Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లేకుంటే దళితులతో గుడిసెలు వేయిస్తాం
సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యుడు మోకు కనకా రెడ్డి
నవతెలంగాణ-పాలకుర్తి
మంచుప్పుల దళితుల భూ సమస్యను పరిష్కరించాలని, లేకుంటే దళితులందరిని కూడగట్టి గుడిసెలు వేయిస్తామని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యుడు మోకు కనకారెడ్డి హెచ్చరించారు. తమకు కేటాయించిన ఇండ్ల స్థలాల భూమిని తమకే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ దళితులు చేపడుతున్న రిలే నిరాహార దీక్షలకు సీపీఐ(ఎం) జనగామ జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు రాపర్తి రాజుతో కలిసి శుక్రవారం ఆయన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దళితులకు కేటాయించిన భూమిని కబ్జా చేయాలని చూస్తున్న వారిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలన్నారు. భూ సమస్యను పరిష్కరించాలని దళితులు 45రోజుల నుంచి దీక్షలు చేస్తున్నా అధికారపార్టీ అండతో అధికారులు సమస్యను పరిష్కరించకుండా కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు.
దళితులకు న్యాయం చేయాల్సిన అధికారులు, అధికార పార్టీ అండతో వారికీ అన్యాయం చేస్తూ తప్పుడు నివేదిక అందజేస్తున్నారని ఆరోపించారు. న్యాయమైన సమస్యల కోసం దళితులు చేస్తున్న ఉద్యమాన్ని నీరుగార్చేందుకు అధికార పార్టీ నాయకులతో పాటు అధికారులు కుట్రలు చేస్తున్నారన్నారు. దళితులకు ఇచ్చిన భూమిలో ఇంటి స్థలాలు ఇచ్చి హద్దులు చూపకుండా లాక్కోవడం దారుణమన్నారు. రాష్ట్రంలోని దళితులందరికీ అన్యాయమే జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పట్టా సర్టిఫికెట్స్ ఉన్నవారందరికీ ఇండ్ల స్థలాలు అప్పజెప్పాలన్నారు. లేకుంటే దళితులను కూడగట్టి ఆందోళన ఉధతం చేస్తామని, దళితులకు కేటాయించిన స్థలంలో గుడిసెలు వేయిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు చిట్యాల సోమన్న, దళితులు కాకర్ల రమేష్, కాకర్ల సోమయ్య, బిక్షం, జీ యాదగిరి, కే కొండయ్య, బీ సోమయ్య, జీ సోమనర్సయ్య, కే రాములు, పీ వెంకన్న, బీ వెంకన్న తదితరులు పాల్గొన్నారు.