Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఏటూరునాగారం
మేడారం మహాజాతర ముగిసే వరకు ఇసుక లారీల రాకపోకలకు అనుమతించొద్దని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చిటమట రఘు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆసియా ఖండంలో రెండో అతిపెద్ద జాతరగా గుర్తింపు పొందిన మేడారానికి లక్షలాదిగా జనం ప్రతిరోజూ వస్తుండగా ఇసుక లారీల రాకపోకలతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని ఆందోళన వెలిబుచ్చారు. ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు మహాజాతర సందర్భంగా మేడారం దారిలో ఇసుక లారీల రాకపోకలను నిషేధించాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రతిసారీ జాతర సందర్భంగా ఇసుక లారీల వల్ల ట్రాఫిక్ జామ్ అయ్యి గంటల పాటు జనం ఇబ్బందులు పడడమే కాకుండా ప్రమాదాల్లో పలువురు ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. ప్రభుత్వం స్పందించని పక్షంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఈర్సవడ్ల వెంకన్న, కన్నాయిగూడెం జెడ్పీటీసీ నామా కరంచందర్ గాంధీ, మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు అయూబ్ ఖాన్, కన్నాయిగూడెం అధ్యక్షుడు అఫ్సర్, జిల్లా నాయకుడు ఖలీల్ ఖాన్, యూత్ ప్రధాన కార్యదర్శి మహ్మద్ గౌస్, టాన్ అధ్యక్షుడు తాళ్లపెల్లి నరేందర్, వావిలాల ఎల్లయ్య, వావిలాల నర్సింహారావు, ముక్కెర లాలయ్య, సులేమాన్, గడ్డం మహేష్, పడిదల హన్మంతు, కొండగొర్ల పోషాలు, తదితరులు పాల్గొన్నారు.