Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దంతాలపల్లి
రేషన్ డీలర్ల బతుకు భారం అయ్యిందని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మండలంలోని రేషన్ డీలర్లు దయనీయ స్థితిలో ఉన్నట్టు కనపడుతోంది. ప్రభుత్వం నాలుగు నెలలుగా కమీ షన్ చెల్లించకపోవడంతో ప్రతినెలా షాపు అద్దె, కరెంటు బిల్లు, కాంటా వేసే కార్మికుడి వేత నం చెల్లించడానికి అప్పులు చేస్తూ అవి పెరిగిపోవడంతో మానసిక వేదనకు గురౌతున్నారు. మండలంలోని రేషన్ డీలర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై 'నవతెలంగాణ' కథనం..
మండలంలో మొత్తం 24 రేషన్ షాపులుండగా 562 మందికి అంత్యోదయ, 8 వేల మందికి ఆహార భద్రత కార్డులున్నాయి. ఈ క్రమంలో ప్రతినెలా మొత్తం 3 లక్షల 14 వేల 900 క్వింటాళ్ల బియ్యం ప్రజలకు అందిస్తున్నారు. కాగా ప్రభుత్వం కింటా మీద డీలర్‌కు రూ.70లు చొప్పున కమీషన్ చెల్లిస్తోంది. ఇందులోంచి డీలర్లు నడిపించే షాపు అద్దె, విద్యుత్ బిల్లు, కాంటా వేసే కార్మికుడి వేతనం చెల్లించాల్సి ఉంటుంది. అలాగే కుటుంబాన్ని పోషించుకోవాలి. ఇదిలా ఉండగా ప్రతినెలా 1 నుంచి 15 తేదీ వరకు సరుకులు పంపిణీ చేయాల్సి ఉండగా ఓటీపీ పద్ధతిని ప్రభుత్వం ప్రవేశ పెట్టిన క్రమంలో సాంకేతిక కారణాల వల్ల సిగల్ అందక 20, 25 తేదీ వరకు సైతం షాపు తెరిచి ప్రజలకు సరుకులు అందించాల్సిన పరిస్థితి నెలకొంది. ఒక్కో డీలర్ ప్రతినెలా షాపు అద్దె, విద్యుత్ బిల్లు, కాంటా వేసే కార్మికుడి వేతనం కోసం కనీసం రూ.15 వేలు అప్పు చేయాల్సి వస్తోందని తెలుస్తోంది. నాలుగు నెలలుగా ప్రభుత్వం కమీషన్ ఇవ్వకపోవడంతో ఒక్కో డీలర్‌కు దాదాపు రూ.60-70 వేలు వరకు అప్పు అయ్యి వాటిని చెల్లించకలేక, కుటుంబాన్ని పోషించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు తెలుస్తోంది.
బియ్యం బస్తాల్లో కోత
రేషన్ బియ్యం బస్తాల్లో ఒక్కో బస్తాలో మూడు నుంచి ఐదు కిలోల వరకు తక్కువగా వస్తున్నట్టు డీలర్లు తెలిపారు. అయినా అధికారులు పట్టించుకోవడం లేదని పలువురు డీలర్లు చెప్పారు. తూకం తక్కువగా వచ్చిన సందర్భంగా ఆ భారాన్ని సైతం డీలర్లపైనే మోపుతున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బస్తాల్లో బియ్యం తక్కువగా వస్తున్న విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్తే సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని డీలర్లు చెప్పారు.