Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆశించిన దిగుబడి రాక..
అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు..
మూడు నెలల క్రితం రైతు ఆత్మహత్య
ఇబ్బందుల్లో బాధిత కుటుంబం..
నవతెలంగాణ-దామెర
ఉమ్మడి వరంగల్ జిల్లాలో రైతులు బలవంతంగా ఉసురు తీసుకుంటున్నారు. పంట పెట్టుబడి కోసం బ్యాంకుల్లో, ప్రయివేట్ వ్యక్తల వద్ద పొలాలను తాకట్టుపెట్టి అప్పులు తీసుకుని ఆరుగాలం కష్టించి పంటలను సాగు చేస్తున్నారు. అయితే ప్రకృతి వైపరీత్యాల వలన, తెగుళ్లతో ఆశించిన దిగుబడులు రాకపోవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో వారిని ఆదుకునే వారు లేక.. చేసిన అప్పులను తీర్చే మార్గం లేకపోవడంతో మనోధైర్యం కొల్పోయి బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఈ విధంగానే దామెర మండలానికి చెందిన రైతు గడ్డం రాజు ఇటీవల ఆత్మహత్య చేసుకుని మృతిచెందాడు. కొడుకు మృతి తట్టుకోలేక ఆవేదనతో బాధితుడి తండ్రి సైతం మృతిచెందాడు. దీంతో ఆయన కుటుంబం పోషించే పెద్ద దిక్కును కోల్పోయి ఇబ్బందులు ఎదుర్కొంటుంది.
వివరాల్లోకి వెళితే..
మండలంలోని దామర గ్రామానికి చెందిన గడ్డం రాజు(38) ఇంటర్ వరకూ చదువుకున్నారు. పదేండ్ల నుంచి తనకున్న 1.33 గుంటలు భూమిలో వ్యవసాయం చేస్తున్నాడు. అంతే కాకుండా మరో రెండు ఎకరాలను కౌలుకు తీసుకుని పత్తి పంటను సాగు చేస్తున్నాడు. తనకున్న భూమిని ఓ బ్యాంకులో తాకట్టు పెట్టి 15లక్షల రూపాయలను అప్పుగా తీసుకున్నారు. అలాగే ప్రయివేట్ సంస్థలు, వ్యక్తుల నుంచి వ్యక్తిగత, పంట అవసరాల కోసం మరికొన్ని అప్పులు చేశాడు. నాలుగేండ్ల నుంచి ఆశించిన దిగుబడులు రాకపోవడంతో నష్టాలను ఎదుర్కొంటున్నాడు. గతేడాది నుంచి కుటుంబ పోషణ భారంగా మారడంతో పెస్టిసైడ్స్ దుకాణంలో సైతం పని చేస్తున్నాడు. ఈ ఏడాది కూడా ఆశించిన దిగుబడి రాకపోవడంతో అప్పులు తీర్చే మార్గం లేక మనోధైర్యం కోల్పోయి అక్టోబర్ 24. 2021న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన అన్న సదానందం వెంటనే వరంగల్ ఎంజీఎంకు తరలించాడు. ఈ క్రమంలో చికిత్స పొందుతుండగా పరిస్థితి విషమించి అదే రోజు మృతిచెందాడు.
ఇంటి పెద్దదిక్కు కోల్పోడవడంతో ఆ సమయం నుంచి బాధిత కుటుంబం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నది. ఈ క్రమంలో రాజు మృతిచెందిన అనంతరం 20రోజుల్లోనే ఆవేదనతో ఆయన తండ్రి సాంబయ్య సైతం మృతిచెందాడు. మృతుడి తల్లి సైతం అనారోగ్యంతో మంచాన పడింది. మృతుడికి భార్య మౌనిక, కూతురు సాయి ప్రియ, కుమారుడు సాయి రథన్లున్నారు. కూతురు నాలుగో తరగతి, కుమారుడు రెండో తరగతి చదువుతున్నారు. గతంలో ప్రయివేట్ పాఠశాలలో చదువుకునే వీరు తండ్రి మరణానంతరం ఆర్థిక స్థోమత లేకపోవడంతో ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నారు. ఇంటి పెద్ద దిక్కు కోల్పోవడంతో బాధిత కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుంది. దాతలు సాయం చేస్తే కుట్టు మిషన్ గానీ, కిరాణం షాపు గానీ పెట్టుకుని పిల్లలను పోషించుకుంటానని మృతుడి భార్య మౌనిక ఆవేదన వ్యక్తం చేస్తోంది. దేశానికి అన్నం పెట్టాలనుకునే రైతులు ఆశించిన దిగుబడులు రాక, చేసిన ఆప్పులు తీర్చ లేక మృతిచెందడం బాధకరమని, వారిని ప్రభుత్వం ఆదుకోవాలని ప్రజలు కోరుతున్నారు.