Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అదో జాతీయ రహదారి.. అయినా దాని ఆలనా పాలనా చూసేవారు కరువయ్యారు. వాహనదారులకు మెరుగైన సౌకర్యంతో పాటు దూరభారం తగ్గించేందుకు నిర్మించిన జాతీయ రహదారి అంతా గుంతలమయం అయ్యింది. అంతే కాకుండా భారీ వాహనాల ప్రయాణంతో ఏకంగా రోడ్డుపై టైర్ల అచ్చుల మాదిరి గుంతలు ఏర్పడి అనేక ప్రమాదాలు జరిగాయి.. ఇవేవీ ఆ రహదారిని చూసే అధికారులకు పట్టకపోవడంతో ఆ రహదారిపై వెళ్లే భారీ, చిన్న వాహనదారులు అనేక కష్టనష్టాలకోర్చి తమ ప్రయాణాన్ని అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ సాగిస్తున్నారు. వివరాలలోకి వెళితే..
హనుమకొండ జిల్లా గూడెప్పాడ్ నుంచి భూపాలపట్నం వరకు 353సీ జాతీయ రహదారిని నిర్మించారు. ఈ రహదారి నుంచి నేరుగా వయా కాళేశ్వరం మీదుగా మహారాష్ట్ర కూడా చేరుకోవచ్చు. ఈ జాతీయ రహదారి పరకాల నియోజకవర్గంలోని ఆత్మకూరు మండలం గూడెప్పాడ్ నుంచి పరకాల పట్టణం మీదుగా జయశంకర్-భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం చెన్నాపూర్ వరకు మొత్తం 16కిలోమీటర్లు ఉంది. ఈ జాతీయ రహదారి నిర్మించి నెలలు గడవకముందే గుంతలు పడ్డాయి. అంతేకాకుండా స్వయానా పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఈ జాతీయ రహదారిపై ఏర్పడిన గుంతలు, భారీ వాహనాల టైర్ల అచ్చులను అసెంబ్లీలో ప్రస్తావించారు. జాతీయ రహదారిపై అధికారులు స్పందించేటట్టు చేసిన ప్పటికీ ఆ రహదారి ఇంకా బాగుపడలేదంటే అధికారుల చిత్తశుద్ధిని అర్థంచేసుకోవచ్చు. ఈ రహదారిపై జరిగే ప్రయా ణం నరకయాతనే.. అయినప్పటికీ తప్పని పరిస్థితుల్లో వాహనదారులు తమ ప్రయాణాన్ని సాగిస్తున్నారు.
మేడారం వన్‌వే ఈ రోడ్డుపైనుండే..
ఫిబ్రవరి నెలలో జరిగే మహాజాతరకు హైదరాబాద్ మీదుగా వచ్చే ప్రయాణికులు హనుమకొండ, ములుగు మీదుగా చేరుకుంటారు. జాతరకు వచ్చే వాహనాల రద్దీ, ట్రాఫిక్ జామ్‌ను దృష్టిలో పెట్టుకుని మేడారం సమీపాన ఉన్న నార్లాపూర్ గ్రామం నుంచి జయశంకర్-భూపాలపల్లి జిల్లా గొల్లబుద్ధారం, భూపాలపల్లి నుంచి పరకాల మీదుగా హన్మకొండ, కరీంనగర్‌కు వెళ్లే ప్రయాణీకులు వెళ్లేట్లు వన్‌వేను గత జాతరల నుండి అధికారులు రూపొందించగా.. ప్రయాణం అలాగే సాగుతోంది. మహాజాతర మేడారానికి వచ్చే వాహనాలు భారీ సంఖ్యలో రానుండగా టైర్ల అచ్చులు, గుంతలు పడిన ఈ రోడ్డుపై ప్రయాణం చేయాల్సి ఉండగా.. ఈ రోడ్డుకు మరమ్మతులు చేసి మెరుగైన రవాణా సౌకర్యం కల్పించాలని పలువురు వాహనచోదకులు కోరుతున్నారు. పరకాల పోలీసులు పలుమార్లు మొరంమట్టి, కంకర పోయించినప్పటికీ శాశ్వత పరిష్కారం దిశగా జాతీయ రహదారి అధికారులు స్పందించకపోవడం విడ్డూరం.
పట్టించుకోని అధికారగణం
మేడారం జాతరకు మరో 16రోజులే మిగిలి ఉన్నప్పటికీ ఈ జాతీయ రహదారి మరమ్మతులను అధికారులు పట్టించుకోవడంలేదు. శాయంపేట మండలం మాందారి పేట మొదలుకొని పరకాల వరకు గుంతలు పడి ఉన్నాయి. అదేవిధంగా పరకాల ఏసీపీ కార్యాలయం ఎదుట, ఎల్ఐసీ, వ్యవసాయ మార్కెట్‌తోపాటు భూపాలపల్లి రోడ్డులో జాతీయ రహదారిపై భారీ వాహనాల అచ్చులు అరఫీటుకుపైగా లోతుగా ఉన్నాయి. ఈ రహదారికి ఇప్పటికైనా మరమ్మతులు చేపట్టకపోతే అనేక ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయని పట్టణవాసులు పేర్కొంటున్నారు.