Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బయ్యారం
కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థి, యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించకుండా రాష్ట్రాన్ని నిరుద్యోగుల కార్ఖానాగా మార్చి, విద్యార్థి నిరుద్యోగుల ఆత్మహత్యలకు అడ్డాగా మార్చే పాలన రాష్ట్రంలో కెసిఆర్ కొనసాగిస్తున్నాడని పీవైఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రదీప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగ యువకుడు సాగర్ కుటుంబాన్ని పీడీఎస్యూ, పీవైఎల్ రాష్ట్ర కమిటీ ప్రతినిధి బందం సోమవారం పరామర్శించింది. ఈ సందర్భంగా ప్రదీప్ మాట్లాడారు. రాష్ట్రం విద్యార్థి యువత త్యాగాల పునాదులపైన ఏర్పడిందని చెప్పారు. గద్దెనెక్కిన కేసీఆర్ ప్రభుత్వం యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంలో విఫలమయ్యారని విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీఆర్ఎస్ నిరుద్యోగ యువత జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగాలు దొరక్క రాష్ట్రంలో ఇప్పటివరకు 32 మంది నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పాలకులు స్పందించి ఉద్యోగ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేయాలని, సాగర్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పీడీఎస్యూ రాష్ట్ర కోశాధికారి ఆజాద్, రాష్ట్ర కమిటీ సభ్యుడు కాంపాటి పథ్వి, రాష్ట్ర యూనివర్సిటీల కోఆర్డినేషన్ కమిటీ సభ్యుడు నర్సింహారావు, జిల్లా అధ్యక్షుడు ప్రశాంత్, పీవైఎల్ రాష్ట్ర నాయకులు పైండ్ల యాకయ్య, రాకేష్, బోస్, జిల్లా నాయకుడు అనిల్ తదితరులు పాల్గొన్నారు.