Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తహశీల్దార్‌ను సస్సెండ్ చేయాలి
సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు రాపర్తి రాజు
నవతెలంగాణ-పాలకుర్తి
ఇండ్ల స్థలాల కోసం శాంతియుతంగా దీక్షలు చేస్తున్న దళితులపై పోలీసులతో తహశీల్దార్ దౌర్జన్యం చేయించడం దారుణమని, వెంటనే తహశీల్దార్‌ను సస్సెండ్ చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు రాపర్తి రాజు డిమాండ్ చేశారు. మంచుప్పుల గ్రామానికి చెందిన దళితుల భూమి కబ్జాకు గురికావడంతో 48రోజులుగా దీక్షలు చేస్తుండగా.. సోమవారం తహశీల్దార్ ప్రోద్బలంతో పోలీసులు వారి దీక్షలను భగం చేశారు. అనంతరం దళితులను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దళితుల భూ సమస్యను పరిష్కరించాల్సిన తహశీల్దార్ భూకబ్జాదారుల కొమ్ముకాస్తున్నాడని ఆరోపించారు. అధికార పార్టీ నాయకులకు భూమిని కట్టబెట్టేందుకు కరోనా సాకుతో దీక్షలను భగం చేసేందుకు తహశీల్దార్ కుట్ర చేశాడని విమర్శించారు. దీక్షలను అడ్డుకోవాలని పోలీసులకు తహశీల్దార్ ఫిర్యాదు చేయడం విడ్డూరమన్నారు. సామరస్యంగా దళితులు దీక్ష చేద్దామని వచ్చినప్పటికీ వారిని అడ్డుకుని అరెస్టు చేయడం అప్రజాస్వామికమన్నారు. 1993లో అప్పటి ప్రభుత్వం 52మంది నిరుపేదలకు ఇండ్ల స్థలాలు కేటాయిస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇండ్ల స్థలాలను లాక్కోవడం వారి చేతకాని తనానికి నిదర్శనమన్నారు. ఇప్పటికైనా 52దళిత కుటుంబాలకు ఇండ్ల స్థలాలు కేటాయించి, వారికి ఇచ్చిన స్థలంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించాలని డిమాండ్ చేశారు. ఇండ్ల స్థలాల కోసం సామరస్యంగా దీక్షలు చేస్తున్న వారిని అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పొట్ల శేఖర్, జిల్లా కమిటీ సభ్యులు చిట్యాల సోమన్న. కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు తూటి దేవదానం, కాకర్ల రమేష్, బాణాల వెంకన్న, సోమన్న, బిక్షపతి బాబు తదితరులు పాల్గొన్నారు.