Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఐద్వా జిల్లా ఉపాధ్యక్షురాలు కళ్యాణి
నవతెలంగాణ-జనగామ
ఢిల్లీ కస్తూరిబారు నగర్లో మహిళల సామూహిక లైంగిక దాడికి పాల్పడి అవమానించిన దోషులను కఠినంగా శిక్షించాలని ఐద్వా మహిళా సంఘం జిల్లా ఉపాధ్యక్షురాలు పందిళ్ళ కళ్యాణి డిమాండ్ చేశారు. సోమవారం జనగామ జిల్లా కేంద్రంలోని నెహ్రూ పార్క్ సెంటర్ లో మహిళా సంఘం ఆధ్వర్యంలో మహిళలు ఈ మేరకు నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళను ఇంట్లో నుండి ఎత్తుకుపోయి, జుట్టు కత్తిరించి, మొహానికి నల్ల రంగు పూసి చెప్పుల దండతో కొడుతూ, ఊరంతా ఊరేగించడం పట్ల పాలకులు సిగ్గుపడాలని మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మత విద్వేషాలను రెచ్చగొట్టడంతో పాటు మహిళల మానప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని వాపోయారు. రోజురోజుకు మహిళలపై అత్యాచారాలు హత్యలు పెరుగుతున్నాయని, వాటిని అరికట్టడంలో ప్రభుత్వాలు విఫలం అవతున్నట్టు విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాభాపేక్షను తప్ప, మహిళల రక్షణ పై కనీస శ్రద్ధ చూపడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మహిళల రక్షణ చట్టాలను పటిష్టంగా అమలు పరచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు బూడిది అంజమ్మ, పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు పొన్నాల ఉమా, కొండ వరలక్ష్మి , ఎర్ర అనిత బిరు లావణ్య, అన్నపూర్ణ , బిట్ల లక్ష్మి పాల్గొన్నారు.