Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రామయ్య మరణానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి
ఎన్డీ జిల్లా కార్యదర్శి గౌని ఐలయ్య
నవతెలంగాణ-బయ్యారం
పోడురైతులపై అటవీ శాఖ వేధింపులు ఆపాలని న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి గౌని ఐలయ్య డిమాండ్ చేశారు. ఇల్లందు మండలం ఏడుప్పలగూడెం గ్రామానికి చెందిన కుంజా రామయ్య అటవీ అధికారుల వేధింపుల వల్లే గుండెపోటుతో మృతి చెందిన క్రమంలో ఆయన మరణానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. మండల కేంద్రంలోని గడ్డం వెంకట్రామయ్య విజ్ఞాన కేంద్రంలో బానోత్ నర్సింహ అధ్యక్షతన మంగళవారం నిర్వహించిన ముఖ్య కార్యకర్తల జనరల్ బాడీ సమావేశంలో ఐలయ్య మాట్లాడారు. పోడు భూములకు పట్టాలు ఇస్తామని చెప్పి దరఖాస్తులు తీసుకుని అటవీ శాఖ అధికారులను ఏజెన్సీ గ్రామాలపైకి ప్రభుత్వం ఉసిగొల్పుతోందని విమర్శించారు. గుండాల మండలం తూరుబాక, ముత్తాపురం, నడిమి గూడెం, సజ్జల బోడు, కాంచనపల్లి తదితర గ్రామాల్లో అటవీ దాడులు జరుగుతున్నాయని ఆందోళన వెలిబుచ్చారు. అలాగే జిల్లాలోని కొత్తగూడ, గంగారం మండలాల్లోని ఆదివాసీల భూములను లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం పోడు భూముల పట్టాల ప్రక్రియ పూర్తి చేసే వరకు పోడు రైతుల జోలికి వెళ్లవద్దని అటవీ శాఖ అధికారులను కోరారు. పోడు పట్టాల ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఏఐకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి దేశెట్టి రామచంద్రయ్య, జిల్లా నాయకులు మేకల ఉప్పలయ్య, పార్టీ మైదాన మండల కార్యదర్శి మాదంశెట్టి నాగేశ్వర్రావు, నాయకులు కొదుమూరి వీరభద్రం, దుస్స వీరభద్రం, ధరావత్ మంగీలాల్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.