Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తాడ్వాయి
మండలంలోని మేడారంలోని ఆదివాసీ మ్యూజియంలో కోయ గిరిజనుల ఇలవేల్పుల సమ్మేళనం గురువారం జోరుగా సాగింది. రెండో రోజు కార్యక్రమాల్లో భాగంగా మూడో గొట్టుకు చెందిన కాకేటి పూజారి వడ్డే గోత్రం, నాల్గో గొట్టుకు చెందిన సనపగాని గోత్రం, ఐదో గొట్టుకు చెందిన బండాని గోత్రం, ఆరో గొట్టుకు చెందిన పెరంబోయిన గోత్రం, ఏడో గొట్టుకు చెందిన పర్దాని గోత్రం తలపతులను పరిచయం చేస్తూ ఆయా గోత్రాల పుట్టుపుర్వోత్తరాలను అడితి బిడ్డలు వంశ మూల పురుషుల చరిత్ర ఘట్టాలతోపాటు భూమి, నీరు, ఆకాశం, జీవం పుట్టుక గురించి వివరించారు. అలాగే మూడో గోత్రం అడితి బిడ్డ నక్క సూరిబాబు, మూడో గోత్ర మూల పురుషుడు పిడగ రాజు చరిత్రను, వారి రాజ్యాలను, దేవత లను పరిచయం చేశారు. మూడో గొట్టు తలపతులు తాటి కన్నారావు, తాటి వెంకటేశ్వర్లు, మూడో గొట్టు పండుగల సంస్కతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, కట్టుబాట్ల గురించి అవగాహన కల్పించారు. నాల్గొ గొట్టు సనపగాని గోత్రం అడితి బిడ్డ నాగుల శ్రీరాములు జీవం ఉద్భవించడం, సనపగాని గోత్ర రాజుల రాజ్యాలు, వారి అస్తిత్వం గురించి చైతన్యవంతం చేశారు. ఈనెల 4న బండాని, పెరంబోయిన, పర్దాని గోత్రాల గురించి, వారి తలపతులు, అడితిబిడ్డలు వివరించనున్నారు. కార్యక్రమంలో మ్యూజియం క్యూరేటర్ డాక్టర్ దేవనపల్లి సత్యనారాయణ, టీసీఆర్ అండ్ టీఐ కోట పుల్లయ్య, కోయిల రాజేష్, మేడారం పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు, ఆయా ఇల వేల్పుల తలపతులు నాగుల శ్రీరాములు, శ్యామల కాంతారావు, ఊకె చంద్రయ్య, తెల్లం రామయ్య, బెండబోయిన లక్ష్మీనారాయణ, ఇర్ప రాజారావు, కోరం చంద్రయ్య, తవిటి నారాయణ, సోయం కష్ణమూర్తి, తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు వట్టం ఉపేందర్, పీసా ఐటీడీఏ కోఆర్డినేటర్ కొమరం ప్రభాకర్, టీడబ్ల్యూటీయూ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు పొదెం కష్ణప్రసాద్, అసిస్టెంట్ మ్యూజియం క్యూరేటర్ కురసం రవి, పరిశోధక విద్యార్థి చందా మహేష్, తుడుందెబ్బ రాష్ట్ర కార్యదర్శి కబ్బాక శ్రావణ్‌కుమార్, మల్లెల రాంబాబు, ఆదివాసీ సేన రాష్ట్ర బాధ్యులు సోడే వెంకటేష్, కొమురం అనిల్‌కుమార్, పెనక ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.