Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తాడ్వాయి
మేడారం జాతర ఆదివాసీల ఆత్మగౌరవానికి ప్రతీకగా వైఎస్సార్టీపీ అధినేత షర్మిల అభివర్ణించారు. రాష్ట్ర ప్రభుత్వం పోడు భూముల సమస్యను పరిష్కరించడంలో విఫలమైందని ఆమె విమర్శించారు. ఆమె మండలంలోని మేడారంలోని వనదేవతలకు గురువారం నిలువెత్తు బంగారాన్ని (బెల్లం) సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలుత ఆమెకు గిరిజన సంప్రదాయాలతో పూజారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం మేడారంలోని ఆదివాసీ మ్యూజియంలో నిర్వహిస్తున్న ఆదివాసీ సమ్మేళనంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు రామసహాయం శ్రీనివాస్‌రెడ్డితో కలిసి షర్మిల పాల్గొని పరిశీలించి ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలను కొనియాడారు. తదనంతరం షర్మిల మీడియాతో మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ మేడారం జాతర అభివృద్ధికి ఆ రోజుల్లోనే కోట్లాది రూపాయలు కేటాయించారని గుర్తు చేశారు. ప్రస్తుత సీఎం కేసీఆర్‌కు రాష్ట్రంలోని పోడు భూముల సమస్యను పరిష్కరించడానికి తీరిక దొరకడం లేదని ధ్వజమెత్తారు. పోడుభూముల సమస్యను పరిష్కరిస్తానని, అర్హులకు పట్టాలిస్తామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన కేసీఆర్ సీఎం అయ్యాక విస్మరించి మోసపూరితంగా వ్యవహరించడం సరికాదన్నారు. సమ్మక్క-సారలమ్మల స్ఫూర్తితో ఆదివాసీలు, గిరిజనులు రాష్ట్ర ప్రభుత్వ తప్పుడు విధానాలపై పోరాడాలని సూచించారు. కార్యక్రమంలో ఆ పార్టీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు అప్పం కిషన్, తాడ్వాయి మండల అధ్యక్షుడు బాగె నర్సింహులు, తదితరులు పాల్గొన్నారు.