Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఊడిపోతున్న ప్యాచ్ పనులు
నవతెలంగాణ-గోవిందరావుపేట
లక్నవరం పర్యాటక కేంద్రానికి వేసిన బీటీ రహదారి ఎత్తు వంపులతో సందర్శకుల వాహనాలను ఇబ్బందులకు గురి చేస్తోంది. కాంట్రాక్టర్ సరైన నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ఈ దుస్థితి నెలకొందని మండల ప్రజలు మండిపడుతున్నారు. పంచాయతీరాజ్ శాఖ నిధుల నుంచి రూ.1.48 కోట్ల వ్యయంతో చల్వాయిలో 163వ నెంబర్ జాతీయ రహదారి నుంచి లక్నవరం పర్యాటక కేంద్రం వరకు మూడు కిలోమీటర్ల మేరకు బీటీ రహదారి నిర్మాణ పనులు, కొంత దెబ్బతిన్న రహదారి ప్యాచ్ వర్క్‌ల నిర్మాణం చేపట్టారు. నిర్మాణ పనులు పూర్తి కాకుండానే మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు హడావుడిగా రహదారిని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించడంతోపాటు పర్యాటకులకు మేలు కలిగిందని కితాబివ్వడం దారుణమన్న వ్యాఖ్యలు వినవస్తున్నాయి. ప్యాచ్ వర్క్ ఇప్పటికే ఊడిపోతుండడం కాంట్రాక్టర్ నాసిరకంగా పనులు చేపట్టడాన్ని కండ్లకు కడుతోంది. కొన్ని చోట్ల ప్యాచ్ వర్క్‌లపై బీటీ వేయలేదు. మరికొన్ని చోట్ల నాణ్యత లోపంతో వేయడంతో బీటీ ఊడిపోతోంది. ఈ దశ్యాలు రహదారి పొడవునా కనపడుతున్నాయి. గతంలో బీటీ తొలగించిన కుప్పలను కూడా రహదారికి దూరంగా వేయకపోవడంతో వాహనదార్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పాత బీటీ కుప్పల వల్ల ప్రమాదాలు కూడా చోటు చేసుకుంటున్నాయని స్థానికులు అంటున్నారు. జింకల పార్కు నుంచి లక్నవరం పర్యాటక కేంద్రంలోని ఎత్తు ప్రదేశానికి పోయే ప్రాంతంలో వేసిన బీటీ రహదారి నిర్మాణం ఎత్తు వంపులతో వాహనాలను ఉయ్యాల మాదిరిగా ఊపుతున్నట్టు వేశారని పలువురు మండిపడ్డారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యమా? లేక పర్యవేక్షణ అధికారుల లోపమా? అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గ్రామస్తులు, సర్పంచ్ సింగం శ్రీలత, ఉపసర్పంచ్ దేవేందర్‌రెడ్డి సమస్యను ఇంజనీరింగ్ అధికారుల, కాంట్రాక్టర్ దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించినా వారు స్పందించని దుస్థితి నెలకొంది. వేసిన బీటీ రహదారికి ఇరువైపులా స్థానికంగా ఉన్న మట్టిని తవ్వి గీతగా పోస్తూ నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా పంచాయతీ రాజ్ శాఖ అధికారులు మామూళ్ల మత్తులో నుంచి తేరుకొని రహదారి నాణ్యతను పరిశీలించి రహదారిని నాణ్యతతో నిర్మించేలా చర్యలు చేపట్టాలని బసాపురం ప్రజలు కోరుతున్నారు.