Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నర్సంపేట
కార్పొరేట్ కంపెనీల బాగు కోసమే కేంద్రంలోని ప్రధాని మోదీ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు తక్కెళ్లపెల్లి శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల రమేష్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో తక్కల్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్లో కార్పొరేట్ సంస్థలకు లాభం చేకూరేలా.. పేద ప్రజాలపై మరింత పన్ను భారం మోపే విధంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రానికి మొండిచేయి చూపించిందని, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ బయ్యారం ఉక్కు పరిశ్రమ, టెక్స్టైల్ పార్క్, ఉమ్మడి వరంగల్ జిల్లా పారిశ్రామిక అభివద్ధి, ఉద్యోగ ఉపాధి వంటి అంశాలు బడ్జెట్లో లేకపోవడం దుర్మార్గమని విమర్శించారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వద్ద నుంచి నిధులు రాబట్టడంలో వైఫల్యం చెందిందని, విభజన చట్టంలోనిఅంశాల ప్రస్తావన లేకపోవడం పట్ల మౌనం పాటించడం సిగ్గుచేటన్నారు. టీఆర్ఎస్, బీజేపీ ప్రజలను మభ్య పెడుతూ పాలన సాగిస్తున్నాయని దుయ్యపట్టారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇందుకోసం సీపీఐ పోరాటాలు చేపట్టాల్సి వస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అక్కపల్లి రమేష్, సీపీఐ జిల్లా నాయకులు మియాపూర్ గోవర్ధన్, నాయకులు రాస లక్ష్మయ్య, మహేందర్ పాల్గొన్నారు.