Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఏసీపీ శ్రీనివాస్
నవతెలంగాణ కాజీపేట
యువత మాదక ద్రవ్యాలకు బానిసలై తమ జీవితాలను బలి చేసుకోవద్దని కాజీపేట ఏసీపీ శ్రీనివాస్ అన్నారు. ఆదివారం కాజీపేట మీడియా పాయింట్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో ఎక్కువ మంది యువత డ్రగ్స్, గంజాయికి అలవాటై జీవితాలను బలి చేసుకుంటున్నారని వాపోయారు. యువత మీద దేశ భవిష్యత్తు ఆధారపడి ఉందన్నారు. డ్రగ్స్ గంజాయి సప్లై చేసే వారిపై ఉక్కుపాదం మోపాలని ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని తెలిపారు. యువత డ్రగ్స్‌కు అలవాటు కాకుండా చూడవలసిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందన్నారు. మాదకద్రవ్యాలకు మత్తు పదార్ధాలకు దూరంగా ఉండి ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలన్నారు.
కాజీపేట బంధం చెరువు వద్ద మాదకద్రవ్యాలకు అలవాటు అయిన వ్యక్తులకు కౌన్సెలింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రతి ఒక్కరిని కలుపుకొని గంజాయి డ్రగ్స్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. వాటి నివారణకు ప్రతిఒక్కరూ సహకరించాలని తెలిపారు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని అన్ని పోలీసుస్టేషన్ల నుంచి ఆటో ర్యాలీని నిర్వహిస్తున్నామని తెలిపారు. దేశ భవిష్యత్తు అయినా యువతను కాపాడడం మన అందరి బాధ్యతన్నారు. కాజీపేటలో రైలు మార్గంలో మాదకద్రవ్యాలను రవాణా చేసే అవకాశం ఎక్కువగా ఉన్నందున రైల్వే ఆర్పీఎఫ్, జీఆర్పీ, ఎక్సైజ్ అధికారులతో మాట్లాడి మత్తుపదార్థాల రవాణాను ఏ విధంగా అరికట్టాలని సమావేశాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. మత్తు పదార్థాలు విక్రయించిన రవాణా చేసిన పోలీస్ కమిషనరేట్ లో 9440700506 వాట్సాప్ నంబర్ కు సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు. కాజీపేటలో మాదకద్రవ్యాల నివారణ కోసం నోడల్ ఆఫీసర్‌గా ఎస్ఐ ఫణి ని నియమించినట్లు తెలిపారు. ప్రజలందరూ ఈ విషయంలో పోలీసులకు సహకరించాలని కోరుతున్నామని తెలిపారు.