Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కేసముద్రం రూరల్
కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న మతోన్మాదం అత్యంత ప్రమాదకరమని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్ అన్నారు. దీనిపై అభ్యుదయ శక్తులను కలుపుకుని కమ్యూనిస్టులు పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. మండల కేంద్రంలోని ఆ పార్టీ కార్యాలయంలో కావటి నర్సయ్య అధ్యక్షతన ఆదివారం నిర్వహించిన మండల కమిటీ సమావేశానికి శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఓవైపు మతోన్మాదాన్ని ప్రేరేపిస్తూనే మరోవైపు ప్రభుత్వ రంగ సంస్థలు కార్పొరేట్ కంపెనీలకు కారుచౌకగా కట్టబెడుతోందని విమర్శించారు. ఈ క్రమంలో దేశాన్ని ఆర్థికంగా దివాళా తీస్తున్న కేంద్ర ప్రభుత్వ తీరుపై ప్రగతిశీల శక్తులు స్పందించి ప్రతిఘటించాలని ఆకాంక్షించారు. సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు గుడిగంటల రాజన్న, జిల్లా కమిటీ సభ్యులు మార్తినేని పాపారావు, మండల కార్యదర్శి వెంకటేశ్వర్లు, నాయకులు బొబ్బాల యాకూబ్‌రెడ్డి, చాగంటి కిషన్, తాడబోయిన శ్రీశైలం, సీఐటీయూ మండల కార్యదర్శి జల్లె జయరాజు, పోతరబోయిన ఉప్పలయ్య తదితరులు పాల్గొన్నారు.