Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
మేడారం జాతరను తాత్కాలిక కమిటీని నియమించి నిర్వహిస్తున్నారు. జాతర చైర్మెన్‌తో పాటు 14 మంది డైరెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నియమించిన విషయం విదితమే. జాతర సమీపి స్తుండగా ఉత్సవ కమిటీ చైర్మెన్, సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించకపోవడం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పర్యటనలోనే ప్రమాణ స్వీకారం ఉంటుందని భావించినా జరగలేదు. మరో 10 రోజుల్లో మేడారం జాతర ప్రారంభం కానుండగా అధికారులు సమాచారం ఇవ్వకపోవడంతో అసలు ఉత్సవ కమిటీ ప్రమాణస్వీకారం ఉంటుందా ? లేదా ? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే తాత్కాలిక కమిటీ కావడంతో ప్రమాణస్వీకారం ఉండదని దేవాదాయ శాఖ మేడారం కార్యనిర్వాహణ అధికారి రాజేందర్ 'నవతెలంగాణ'కు తెలిపారు.
మేడారం జాతర 10 రోజుల్లో ప్రారంభం కానుండగా ఉత్సవ కమిటీ చైర్మెన్, సభ్యుల ప్రమాణస్వీకారం చేయకపోవడం చర్చనీయాం శంగా మారింది. ఈ కమిటీలో ఆదివాసేతరు లను నియమించడం పట్ల ఆదివాసీ సంఘాలు భగ్గుమంటున్న విషయం విదితమే. ఈ కమిటీ తాత్కాలికమా? అన్న సందేహం వ్యక్తమౌతోంది. ఇదిలా ఉంటే నాగోబా జాతర ట్రస్టు బోర్డులో ఆదివాసీలను మాత్రమే డైరెక్టర్లుగా నియమిస్తుం డడాన్ని గిరిజనులు ప్రస్తావిస్తున్నారు. అదే తరహాలో మేడారం ట్రస్టు బోర్డులో డైరెక్టర్లను నియమించాలని ఆదివాసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం గమనార్హం. తాజాగా మేడారం ట్రస్టు బోర్డులో 8 మంది ఆదివాసేతరులను డైరెక్టర్లుగా నియమించడంతో ఆదివాసీ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న విషయం విదితమే.
కమిటీ ఉత్సవ విగ్రహమే..
రాష్ట్ర ప్రభుత్వం మేడారం ట్రస్టుబోర్డు చైర్మెన్‌గా కొర్నిబెల్లి శివయ్య (ఎస్టీ కోయ)ను నియమించింది. డైరెక్టర్లుగా సప్పిడి వెంకట్రాం నర్సయ్య (బీసీ గౌడ), చిలకమర్రి రాజేందర్ (బీసీ పెరిక), లకావత్ చందూలాల్ (ఎస్టీ లంబాడీ), వట్టం నాగరాజు (ఎస్టీ కోయ), బండి వీరస్వామి (ఎస్సీ నేతకాని), సానికొమ్ము ఆదిరెడ్డి (ఓసీ రెడ్డి), ఆలం శోభారాణి (ఎస్టీ కోయ), నక్క సాంబయ్య (బీసీ యాదవ), సత్యనారాయణ (ఎస్టీ కోయ), తండ రమేశ్ (బీసీ గౌడ), పొదెం శోభన్ (ఎస్టీ కోయ), అంకం క్రిష్ణస్వామి (బీసీ వడ్డెర), సిద్దబోయిన జగ్గారావు (ఎస్టీ కోయ)లను నియమించారు. వీరి ప్రమాణస్వీకారం జరగబో తోందంటూ ప్రచారం జరిగిన రెండు సందర్భా ల్లో జరగలేదు. దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సందర్శించిన సందర్భంలో ఏర్పాట్లను మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌లతో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగానే ప్రమాణస్వీకారం వుంటుందని ప్రచారం జరిగినా జరుగలేదు. దీంతో ఈ కమిటీపై సర్వత్రా సందేహాలు వ్యక్తమయ్యాయి. ఎట్టకేలకు ఈ కమిటీ ఉత్సవ విగ్రహంగానే మిగిలిందన్న ప్రచారం జరిగింది.
తాత్కాలిక కమిటీనే..
రాజేందర్, ఈఓ, మేడారం
జాతర ఉత్సవ కమిటీ తాత్కాలికమైనదే కాబట్టి ప్రమాణస్వీకారం వంటి కార్యక్రమాలు ఏమీ ఉండవు. రెగ్యులర్ కమిటీని నియమిస్తేనే ప్రమాణస్వీకారం చేయిస్తారు.