Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాజీపేట
కాజీపేట ఫాతిమానగర్‌లోని లోడీ సాంఘిక సేవా సంస్థ కార్యాలయంలో డైరెక్టర్ ఫాదర్ విజయపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో హెచ్ఐవీ బాధిత కుటుంబాలకు శనివారం నిత్యావసర సరుకులు, సైకిళ్లు, బట్టలు, ఆర్థికసాయం అందించారు. ఈ సందర్భంగా ఫాదర్ అన్నపురెడ్డి రాజా, విజయపాల్‌రెడ్డి, ఆనంద్‌రెడ్డి మాట్లాడారు. సంస్థ దాదాపు 350 మంది పిల్లలను దత్తత తీసుకొని రెండు నెలలకోసారి నిత్యావసర సరుకులు అందజేయడం సంతోషకరమైన విషయమన్నారు. బాలలను కాపాడుకోవాల్సిన బాధ్యత సమాజంలోని అందరిపై ఉందన్నారు. హెచ్ఐవీతో జీవిస్తున్న వారికి సమాజంలో చిన్నచూపు చూస్తున్నారని, కానీ ప్రజలందరూ వారిని సాధారణంగా జీవించేలా చూడాలని కోరారు. అనంతరం తెలంగాణ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ప్రోగ్రాం జిల్లా మేనేజర్ స్వప్న మాధురి మాట్లాడుతూ బాధిత కుటుంబాలకు, పిల్లలకు ప్రభుత్వపరంగా పెన్షన్ అందజేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఫాదర్ ఆరోగ్యం, ఫాదర్ ప్రతాప్, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ వీరబాబు, బాలశౌరి సురేష్, నాగేష్, కిరణ్, రమేష్, నిర్మల, మమత, శిరీష, అనిత తదితరులు పాల్గొన్నారు.