Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బయ్యారం
స్థానిక ప్రజాప్రతినిధుల, అధికారులు వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న మండలంలోని నారాయణపురం పంచాయితీ కార్యదర్శి ఈసం వెంకటేష్ అంత్యక్రియలు పోలీసుల బారీ బందోబస్త, ఉద్రిక్త పరిస్థితుల మధ్య ముగిశాయి. మండలంలోని పాత ఇర్సులాపురం గ్రామంలో ఈసం వెంకటేశ్వర్లు మృతదేహం వద్దకు వివిధ జిల్లాల నుంచి తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల సంఘం, జాక్టో నాయకులు, పంచాయితీ కార్యదర్శులు, ఆదివాసి సంఘాల నాయ కులు చేరుకొని వెంకటేష్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తు సుమారు 8 గంటలపాటు మతదేహంతో అందోళన కొనసాగించారు. జిల్లా కలెక్టర్ శశాంక అదేశాల మేరకు మహబూబూబాద్ ఆర్డీఓ కొమరయ్య, డీపీఓ సాయిబాబా చేరుకొని పరిస్థితిని ఉన్నతాధికారులకు వివరించారు. కాసేపు పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది. చివరికి వెంకటేశ్వర్లు భార్య సుభద్రకు ఉద్యోగం, డబుల్‌బెడ్ రూమ్ ఇల్లు ఇస్తామని హామీ ఇవ్వడంతో అందోళన విరమించారు. భారీ పోలీసుల బందోబస్తు నడుమ అంత్యక్రియలు ముగిశాయి. సీఐ తిరుపతి, ఎస్సై జగదీష్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో డీఎల్పీఓ గంగా భవానీ, ఎంపీడీఓ చలపతిరావు, ఎంపీఓ పద్మ, తహసీల్దార్ నాగభవానీ, డీఎస్పీ సదయ్య, పంచాయతీ కార్యదర్శుల జేఏసీ నాయకులు మహేష్, శ్రీకాంత్, రాజేష్, ప్రసాద్, నిరంజన్, తదితరులు పాల్గొన్నారు.