Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సుబేదారి
అన్ని ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్లు విడుదల చేయాలని డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి దొగ్గెల తిరుపతి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆ సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతుకు సోమవారం వినతిపత్రం అందించారు. అనంతరం తిరుపతి మాట్లాడారు. ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చి ఓట్లు దండుకుని అధికారంలోకి వచ్చాక మోసపూరితంగా వ్యవహరించడం సరికాదన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేట్‌పరం చేస్తోందని, రాష్ట్ర ప్రభుత్వం సుమారు రెండు లక్షల ఉద్యోగ ఖాళీలున్నా భర్తీ చేయడం లేదని మండిపడ్డారు. ఇప్పటికైనా వెంటనే ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్లు విడుదల చేయడంతోపాటు భర్తీ ప్రక్రియ పూర్తయ్యే వరకు నిరుద్యోగ యువతకు రూ.3 వేల 16లు చొప్పున భృతి చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగాలు రాక యువత ఆత్మహత్య చేసుకుంటున్నా పాలకులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా నాయకులు జెట్టి కుమారస్వామి, శంకర్, బోయిని శివ, ప్రవీణ్, అనిల్, రాజు, రాజేష్, చంటి, తదితరులు పాల్గొన్నారు.