Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ములుగు
పోడు భూములకు పట్టాల కోసం దరకాస్తు చేసుకున్న అర్హులందరికీ వెంటనే విచారణ చేపట్టి పట్టాలివ్వాలని కాంగ్రెస్ పార్టీ జాతీయ నేత, ఎమ్మెల్యే సీతక్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని తన క్యాంప్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన పోడు భూముల పోరాట కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం పోడు రైతులకు మాట ఇచ్చి తప్పిందని విమర్శించారు. 2006 అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేసి ప్రజల నుంచి స్వీకరించిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాల్సిన బాద్యతను ప్రభుత్వం విస్మరించిందని మండిపడ్డారు. ఈనెల 9, 10 తేదీల్లో మేడారం నుంచి ఇల్లందు వరకు బస్సు యాత్ర నిర్వహిస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ స్పందనను బట్టి అవసరమైన రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపడతామన్నారు. పోడు రైతుల పోరాట కమిటీ ఆధ్వర్యంలో గతేడాది ఉద్యమించిన ఫలితంగా సమస్యను పరిష్కరిస్తామని సీఎం అసెంబ్లీలో వాగ్ధానం చేశారని గుర్తు చేశారు. గతేడాది నవంబర్ నుంచి డిసెంబర్ వరకు పోడు భూముల సాగుదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించినా వాటిని పరిశీలించకుడా అటవీ సరిహద్దుల పేరుతో యంత్రాలతో కందకాలు తవ్వడం దుర్మార్గమన్నారు. ఇలాంటి చర్యలను రాష్ట్ర ప్రభుత్వం మానుకోవాలని హితవు పలికారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పోడు సాగుదారులకు హక్కు పత్రాలు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో వామపక్షాలు, గిరిజన, ప్రజాసంఘాలతో కలిసి పార్టీ ఆధ్వర్యంలో మరింత పెద్దఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. సమావేశంలో కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు గొల్లపెల్లి రాజేందర్ గౌడ్, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకట్రెడ్డి, నాయకులు బీరెడ్డి సాంబశివ, అమ్జద్, మత్స్యకార సంఘం జిల్లా అధ్యక్షుడు కంబాల రవి, ములుగు జిల్లా సాధన సమితి అధ్యక్షుడు ముంజాల భిక్షపతి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చాంద్ పాషా, చెన్నోజు సూర్యనారాయణ, రత్నం రాజేందర్, తదితరులు పాల్గొన్నారు.