Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మట్టెవాడ
వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో చిన్నపిల్లల వార్డును సర్వాంగ సుందరంగా పాఠశాలను తలపించేలా వరంగల్ ఎంజీఎం సిబ్బంది తీర్చిదిద్దుతున్నారు. ఈ నెల 10వ తేదీన రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్రావు వరంగల్ నగరంలో పర్యటన ఖరారైంది. ఈ నేపథ్యంలో జిల్లా మంత్రులతో కలిసి ఆయన చిన్నపిల్లల ప్రత్యేక వార్డు ప్రారంభోత్సవం చేయను న్నారు. ఇందుకు తగ్గట్టు ఏర్పాట్లను చకచకా చేస్తున్నారు. ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ బత్తుల శ్రీనివాసరావు ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ ఆస్పత్రిలోని చిన్న పిల్లలకు కావాల్సిన సదుపాయాలను పర్యవేక్షిస్తూ పనులు పూర్తయ్యేలా చొరవ తీసుకుంటున్నారు. రూ.40 లక్షలతో 42 పడకలతో చిన్నపిల్లల కోసం కోవిడ్ ప్రత్యేక సంరక్షణ వార్డును, ఆస్పత్రిలోని పాత చిన్నపిల్లల వార్డును సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ఇందులో 30 పడకలు సాధారణ చికిత్స నిమిత్తం కాగా 8 ఐసీయూ పడకలు, 4హెచ్డియు వార్డులకు కేటాయించారు. ప్రత్యేక ఐసీయూ పడకల కోసం ఎనిమిది వెంటిలేటర్ లను సమకూర్చారు. చిన్నపిల్లల మనసుకు ఆహ్లాదం కల్పించేలా తాము ఆస్పత్రిలో ఉన్నామనే భావన ఉండకుండా పాఠశాలలో ఉన్నామనుకునేలా గోడలపై చిన్నపిల్లల మనసుకు నచ్చే మిక్కీ మౌస్, డోరేమాన్, చోటా భీమ్, గాలి బుడగలు గాలిపటాల, చిత్రాలతో తీర్చిదిద్దుతున్నారు. ఇదంతా చూస్తున్న చిన్నపిల్లల బంధువులు ఆస్పత్రి బృందం తయారు చేస్తున్న ప్రత్యేక వార్డును చూసి పిల్లలు పాఠశాలలో ఉన్నట్లుగా పరిస రాలు ఉన్నాయని హర్షం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల వినూత్న ఆలోచనలను అభినందిస్తున్నారు.