Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఇచ్చిన హామీలను అమలు చేయాలి
అ సీపీఐ(ఎం) జిల్లాకార్యదర్శి మోకు కనకారెడ్డి
నవతెలంగాణ-జనగామ
పోరాడి సాధించుకున్న జనగామ జిల్లాకు ఎన్నికల సందర్బంగా జనగామ జిల్లా పర్యటనలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలు చేసి జిల్లా అభివృద్ధికి తోడ్పడాలని సీపీఐ(ఎం) జనగామ జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్ధార్ శ్రీనివాస్‌కు వినతిపత్రం అందజేసి ఆయన మాట్లాడారు. జనగామ జిల్లా అభివృద్ధికి ఆమడదూరంలో ఉందని అన్నారు. జిల్లాకు చెందిన మంత్రి, ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఎన్నికల సందర్భంగా జిల్లాకు మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తానని సీఎం కేసీఆర్ హామీనిచ్చి మోసగించారని అన్నారు. జిల్లా వ్యాప్తంగా అనేక సమస్యలు పేరుకుపోయాయన్నారు. వ్యవసాయ రంగ అనుబంధ పరిశ్రమలు ఏర్పాటూ చేయాలని, టెక్స్ టైల్స్ పార్క్ పనులను ప్రారంభించి నిర్మాణం పూర్తిచేయాలని, జిల్లాలో ఇండిస్టియల్ కారిడార్ ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. జిల్లాలో ఈఎస్ఐ హాస్పిటల్ ఏర్పాటు చేయాలన్నారు. పాలకుర్తి, బమ్మెర పోతన, జఫర్ఘడ్ కోట, ఖిలాషాపుర్ సర్వాయిపాపన్న కోటతో పాటు రిజర్వాయర్లను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని తెలిపారు. జనగామ పట్టణ కేంద్రంలో పార్కులు, ఆటస్థలాలను ఏర్పాటు చేసి అభివృద్ధి చేయాలని అన్నారు. నర్సింగ్, పాల్టెక్నీక్ కాలేజీలు ఏర్పాటు చేయాలని కోరారు. జిల్లాలోని ఆస్పత్రుల్లో ఖాళీగా ఉన్న అన్ని కేటగిరాల పోస్టులు భర్తీ చేసి మెరుగైన వైద్యసేవలందుంచాలన్నారు. జిల్లా ప్రధాన ఆస్పత్రిలో ఎంఆర్ఐ, సిటీస్కానింగ్, స్కానింగ్ సెంటర్లను ఏర్పాటు చేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, హాస్టల్లో నెలకొన్న స్థానిక సమస్యలు పరిష్కరించాల న్నారు. పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించాలన్నారు. అభివృద్ధి పనుల పెండింగ్ నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు రాపర్తి రాజు, బొట్ల శేఖర్, జిల్లా కమిటీ సభ్యులు బూడిది గోపి, ఎండీ అజారోద్దిన్, బి చందునాయక్, ఆర్ మీట్యానాయక్, పట్టణ కమిటీ సభ్యులు బిట్ల గణేష్, మంగ బీరయ్య, కళ్యాణ లింగం పాల్గొన్నారు.