Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బచ్చన్నపేట
తెలంగాణ ఉద్యమ సమయంలో బచ్చన్నపేటలో వలసబోయిన కుటుంబాల జీవితాలను చూసి సీఎం కేసీఆర్ బాధపడిన సందర్బాలున్నాయని, ప్రతి సభలోనూ ఇదే విషయాన్ని పలుమార్లు గుర్తు చేశారని, అలాంటి సీఎం మండలాన్ని బాగు చేయలేరా అని సీపీఐ(ఎం) జిల్లా కార్యవర్గ సభ్యులు గొల్లపల్లి బాపురెడ్డి విమర్శించారు. గురువారం మండలంలో ఏర్పాటు చేసిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2006లో మండలానికి ప్రభుత్వ జూనియర్ కళాశాల కావాలని పోరాటం చేశామన్నారు. ఇక్కడి ప్రభుత్వ సెకండరీ పాఠశాల ఆవరణలో తరగతులు నిర్వహించాలని ఆదేశాలొచ్చినప్పటికీ అమలు కావట్లేదన్నారు. మండల విద్యార్థులు జనగామ, ఆలేరు, గజ్వేల్ తదితర ప్రాంతాలకు వెళ్లి విద్యనభ్యసిస్తున్నారని అన్నారు. బచ్చన్నపేట మండలానికి ప్రభుత్వ జూనియర్ కళాశాల మంజూరు చేయ్లాన్నారు. దేవాదుల ఎత్తిపోతల పథకం కింద ఒక్క రిజర్వాయర్ లేక పోవడంతో స్థానిక రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. మాన్సాన్పల్లిలో రిజర్వాయర్ నిర్మించి రైతులను ఆదుకోవాలన్నారు. ప్రత్యమ్నాయ పంటలేయాలంటే ముందుగా కోతులు,అడవి పందుల బెడదను నివారించాలన్నారు. ఈ కార్యక్రమం లొ అన్నెబోయిన శ్రీనివాస్, రవీందర్ రెడ్డి, సుధాకర్,రఘురామయ్య, రామయలు, శైలజ, రాణి, తదితరులు పాల్గొన్నారు.