Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ పూర్తికాని విద్యుత్ లైనింగ్
అ పూర్తి కాని టాయిలెట్లు
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయప్రతినిధి
మేడారం జాతర ప్రారంభానికి కేవలం 5 రోజులు మాత్రమే ఉంది. నేటికీ పరిసర గ్రామాల్లో విద్యుత్ లైనింగ్ పనులు పూర్తి కాలేదు. కోటిన్నర మంది ప్రజలు ఈసారి జాతరకు వస్తారని అంచనా. నిరంతరాయంగా విద్యుత్ సౌకర్యం కల్పించాల్సిన ఎన్పీడీసీఎల్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించ డంతో పనులు నేటికీ కొనసాగుతున్నాయి. మరో వైపు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు వాటర్‌ట్యాంకు పనులు, టాయిలెట్ల పనులను పూర్తి చేయలేక పోయారు. చిలుకలగుట్ట ప్రాంతంలో టాయిలెట్ల నిర్మాణం పూర్తి కాలేదు. బేస్ నిర్మించారే తప్పా చుట్టు రేకులు ఏర్పాటు చేయలేదు. మూడు వాటర్ ట్యాంకులు కొత్తవి నిర్మించినా నేటికీ పూర్తి కాకపోవడం గమనార్హం.
జాతరలో నిరంతర విద్యుత్ సదుపాయం కల్పించడమే కీలకం కాగా పనులు పూర్తి చేయక పోవడం గమనార్హం. ప్రతి రెండేండ్ల కోసారి వచ్చే మేడారం జాతరకు సంబంధించి తాడ్వాయి మండల కేంద్రం-మేడారం వరకు, పస్రా-ప్రాజెక్టునగర్, వెంగళాపూర్, నార్లాపూర్, మేడారం వరకు విద్యుత్ లైనింగ్ చేయడం ఆనవాయితీ. జాతర ముగిశాక ఈ లైనింగ్‌ను తొలగిస్తారు. రెండు నెలల ముందు నుండే ఈ పనులు ప్రారంభమైనా నేటికీ ప్రారంభం కాలేదు. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్య వతి రాథోడ్ నిరంతరం సమీక్షా సమావేశాలను నిర్వ హిస్తూ పనులను వేగవంతం చేస్తూ టీిఎస్ ఎన్పీడీసీఎల్ రూ.4కోట్లను కేటాయించారు. జాతరలో నిరంతర విద్యుత్తును అందించడానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. విద్యుత్ లైనింగ్ పనులు, ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాట్లు, ఎక్కడా అంతరా యం కలుగకుండా విద్యుత్ సౌకర్యం కల్పించడానికి చేస్తున్న ఏర్పాట్లు సకాలంలో పూర్తి కాకపోవడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గుత్తేదార్లు సకాలం లో పనులు ప్రారంభించకపోవడంతో పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. నాలుగురోజులపాటు జరిగే జాతరకు రెండు నెలలుగా ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఈ క్రమంలో పనులు సకాలంలో పూర్తి చేయడానికి అధికార యంత్రాంగం ప్రయ త్నించినా, గుత్తేదారులు సకాలంలో పనులను పూర్తి చేయలేకపోతున్నారు.
నిరంతర విద్యుత్‌కు ఆటంకాలు..
జాతర ప్రాంగణంతోపాటు పరిసర గ్రామాల్లో లక్షలాది మంది మేడారం జాతరకు వస్తుండడంతో నిరంతర విద్యుత్తును అందించడానికి జరుగుతున్న ఏర్పాట్లు నేటికీ పూర్తి కాలేదు. ఎన్పిడిసిఎల్ కంపెనీ ఆధ్వర్యంలో జరుగుతున్న పనులను ఇద్దరు గుత్తేదార్లు చేస్తున్నారు. కొత్తూర్ సబ్‌స్టేషన్‌లో విద్యుత్ అధికారులు క్యాంప్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకొని పనులను కొనసాగిస్తున్నారు. ఇంకా ఐదు రోజులుండగా నేటికీ వెంగళాపురం పరిసర ప్రాంతాల్లో విద్యుత్ లైనింగ్ పనులు జరుగుతున్నాయి.
పూర్తికాని వాటర్ ట్యాంక్‌లు
ఆర్డబ్ల్యూఎస్ అధికారులు కొత్తగా మూడు వాటర్ ట్యాంకులను ఒక్కోక్కటి రూ.60 లక్షల చొప్పున వెచ్చించి నిర్మిస్తున్నా, నేటికీ వాటి పనులు పూర్తి కాలేదు. ఆర్టీసి బస్టాండ్ వద్ద ఒకటి, మేడారం జాతర ప్రాంగణంలో ఒకటి, హరిత హౌటల్ వద్ద 200 కెఎల్ సామర్ధ్యం కలిగిన వాటర్ ట్యాంక్‌లను నిర్మించారు. నేటికీ వాటికి పైప్‌లైన్ లింక్ నిర్మించ లేదు. ఇదిలా ఉంటే గత జాతర సందర్భంలో ఊరట్టంలో 200 కేఎల్ వాటర్ ట్యాంక్‌ను నిర్మిం చినా, నాటి నుండి నేటి వరకు పైప్‌లైన్‌కు లింక్ కలపకపోవడంతో తాగునీరు ఊరట్టం ప్రజలకు అందలేదు. ఈ నాలుగు వాటర్ ట్యాంక్‌లను సకాలంలో వినియోగంలోకి తీసుకురావడంలో జిల్లా అధికార యంత్రాంగం విఫలమైంది.
పూర్తికాని టాయిలెట్ల నిర్మాణం
ఆర్డబ్ల్యుఎస్శాఖ అధికారులు నేటికీ టాయిలెట్ల నిర్మాణాన్ని సైతం పూర్తి చేయలేదు. చిలుకలగుట్ట ప్రాంతంలో బేస్ నిర్మించారే కాని చుట్టూ రేకులను అమర్చడంలో విఫలమయ్యారు. అంతేకాకుండా పస్రా-మేడారం రహదారిలో వెంగళాపూర్ నుండి నార్లాపూర్ వరకు ప్రైవేలు వాహనాల్లో వచ్చే భక్తులు అటవీ ప్రాంతంలో టాయిలెట్ల నిర్మాణం లేక బహిరంగ మల, మూత విసర్జన చేస్తున్నారు. ముఖ్యంగా వెంగళాపూర్‌లో టాయిలెట్లను నిర్మించలేదు. జాతరకు 6 నెలల ముందు నుండి పనులు ప్రారంభించాలని ప్రతి జాతర ముందు అనుకుంటున్నా క్షేత్రస్థాయిలో మాత్రం పనులు సకాలంలో పూర్తి కావడం లేదు.