Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సంగెం
మండలంలో విచ్చలవిడిగా బెల్టుషాపులు వెలుస్తున్నాయి. దీంతో మద్యం ఏరులై పారుతోంది. విచ్చలవిడిగా మద్యం దొరకడంతో మద్యం ప్రియులు పేట్రేగిపోయి గొడవలకు దిగుతున్నారు. ఇటీవల ఓ గ్రామంలో బెల్టుషాపుల్లో మద్యం సేవించిన యువకులు ఒకరి మీద మరొకరు బీరు సీసాలతో దాడి చేసుకుని పోలీసు స్టేషన్ వరకూ వెళ్లిన ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇలాంటి ఘటనలు జరుగుతున్నా నియంత్రించాల్సిన ఎక్సైజ్ అధికారులు మాముళ్లు తీసుకుంటూ చోద్యం చూస్తున్నారని మండల వాసులు తెలుపుతున్నారు.
అంతే కాకుండా మండలంలోని గ్రామాల్లోని బెల్టుషాపుల నిర్వాహకులు అందరూ వారి వ్యాపారాభివృధ్ధి కోసం ఒక కమిటీని ఎన్నుకున్నట్టు సమాచారం. పై పెచ్చు ఆ కమిటీకి ఓ సహకార సంఘం చైర్మన్‌ను అధ్యక్షుడిగా ఎన్నుకున్నట్టు మండల వాసులు చర్చించుకుంటున్నారు. అధ్యక్షుడిగా ఎన్నికైన వ్యక్తి ఆధ్వర్యంలో బెల్టు షాపు నిర్వాహకులు గ్రామాల్లో అధిక ధరలకు మద్యాన్ని అమ్ముతున్నారని, నకిలీ, కల్తీలకు పాల్పడుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో గ్రామాల్లో బెల్టుషాపుల మూలంగా నిత్యం గొడవలు చోటు చేసుకుంటుండమే కాకుండా ప్రజలు ఆర్థికంగా నష్టపోతున్నారు. నకిలీ, కల్తీ మద్యంతో అనారోగ్యాల బారినపడుతున్నారు.
బెల్టుషాపుల వారూ అధ్యక్షుడి సహకారంతో ఇష్టారీతిన నకిలీ, కల్తీ మద్యాన్ని అధిక ధరలకు విక్రయిస్తున్నారు. దీంతో ప్రజలు ఆర్థికంగా నష్టపోవడంతో పాటుగా అనారోగ్యాలకు గురువుతన్నారు. అయినా పట్టించుకోవాల్సిన ఎక్సైజ్ అధికారులు మామూళ్ల మత్తులో తూగు తున్నారని ప్రజలు తెలియజేస్తున్నారు. ఇప్పటికైనా ఎక్సైజ్ అధికారులు బెల్టుషాపులను నియంత్రించాలని ప్రజలు కోరుతున్నారు.