Authorization
Mon Jan 19, 2015 06:51 pm
యథేచ్ఛగా వసూళ్ల దందా ..!
వెనక ఉన్న దెవరూ..?
నవతెలంగాణ-పోచమ్మ మైదాన్
ఉర్సు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ల విషయంలో అక్రమాలు జరుగుతున్నాయనే అను మానం సబ్ రిజిస్ట్రార్ వ్యవహార శైలిని చూస్తే నిజమేనని అనిపించక మానదని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ సబ్ రిజిస్ట్రార్ తనను ఎవరూ ఏమీ చేయలేరన్న ధోరణిలో వ్యవహరిస్తూ నియమాలకు విరుద్ధంగా భూరిజిస్ట్రేషన్లు చేస్తున్న దాఖలాలు కానవస్తున్నాయి. ఆ కార్యాలయంలోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తే గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న తతంగాలు బయటికి వస్తాయని పలువురు అంటున్నారు.
నియమాలకు విరుద్ధంగా జరుగుతున్న లావాదేవీల్లో సబ్ రిజిస్ట్రార్ ప్రమేయం ఉండోచ్చని అనుమానాలు వినిపిస్తున్నాయి. బడా నాయకుల అండదండలతోనే ఆయన అక్రమ రిజిస్ట్రేషన్లు చేస్తున్నాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వారి అండతోనే ఆయన పదేండ్ల నుంచి ఈ కార్యాలయంలోనే వివిధ స్థాయిలో విధులు నిర్వహిస్తున్నాడని వినవస్తోంది. ఈ కార్యాలయంలో అనేక అక్రమాలు జరుగుతున్నాయని పలువురు చర్చించుకుంటున్నట్టు సమాచారం. ఉన్నతాధికారులు పూర్తిస్థాయిలో సబ్ రిజిస్ట్రార్‌పై విచారణ నిర్వహించి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.