Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మూడున్నర లక్షలతో అభివృద్ధి పనులు
భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు
నవతెలంగాణ-శాయంపేట
మండలంలోని జొగంపల్లి శివారులో నిర్వహిస్తున్న మినీ సమ్మక్క సారలమ్మ జాతరకు ఉత్సవ కమిటీ సభ్యులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 16 నుంచి జాతర ప్రారంభం కానుండడంతో గద్దెల చుట్టూ ఉన్న గ్రిల్స్‌కు పెయింటింగ్ వేయించారు. జాతర ప్రాంగణంలో పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించి చదును చేయించారు. ఉత్సవ కమిటీ సభ్యులు జాతర ప్రాంగణంలో భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా విద్యుత్ దీపాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ జాతరకు మండల పరిధిలోని గ్రామాల ప్రజలే కాకుండా చుట్టుపక్కల మండలాల నుండి ప్రజలు అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకోవడం కోసం వస్తుండడంతో భక్తుల కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. 30ఏండ్లుగా కొనసాగుతున్న జాతర
జొగంపల్లి మినీ సమ్మక్క సారలమ్మ జాతర 1992 నుంచి ప్రతి రెండేండ్ల ఒకసారి మైలారం, పెద్దకొడపాక, జొగంపల్లి గ్రామ పెద్దల సహకారంతో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ జాతరకు మైలారం గ్రామంలొని నూనె సత్యం ఇంటి నుంచి లంక వనాన్ని, పెద్దకొడపాక విశ్వబ్రాహ్మణుల ఇంటి నుంచి పోచమ్మ బోనాలను, కొండా శ్రవణ్ కుమార్ ఇంటి నుండి వీర బోనంను, ఈమ్మడిశెట్టి రవీందర్ ఇంటినుండి పసుపుకుంకుమలు, తడుక ఈశ్వరయ్య ఇంటి నుండి ఘటం కుండ, అమ్మ ధర్మయ్య ఇంటి నుండి సారలమ్మను, చెక్క బలరామ ఇంటి నుండి సమ్మక్కను, చేక్క రాజు ఇంటి నుండి పగిడిద్దరాజును, రేణిగుంట్ల మల్లయ్య ఇంటి నుండి లక్ష్మీ దేవరను, అబ్బు ప్రకాష్ రెడ్డి ఇంటి నుండి మేకపోతును డప్పు చప్పుళ్ళ మధ్య గద్దెలపైకి తీసుకు రావడంతో ఉత్సవాలు ప్రారంభం అవుతాయి. ఈ ఉత్సవాలకు రెవెన్యూ అధికారుల పర్యవేక్షణలో పోలీస్ అధికారుల బందోబస్తు మధ్య కొనసాగుతోంది. ఈ నెల 16న సారలమ్మను గద్దెపైకి తీసుకొని వచ్చుట, 17న సమ్మక్క ఆగమనం, 18న మొక్కులు చెల్లింపులు, అమ్మవార్ల దర్శనం, 19న అమ్మ వారాలు వన ప్రవేశంతో ఉత్సవాలు ముగుస్తాయని మినీ మేడారం జాతర చైర్మెన్ పల్నాటి జలంధర్ ప్రకటించారు.
మూడున్నర లక్షలతో అభివృద్ధి పనులు..
మినీ సమ్మక్క సారలమ్మ జాతరలో తాత్కాలిక మరుగుదొడ్లు, త్రాగు నీటి వసతి కోసం భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి, వరంగల్ రూరల్ జెడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి ఆర్డబ్ల్యూఎస్ శాఖ నుంచి మూడున్నర లక్షల నిధులు మంజూరు చేయించారు. ఈ నిధులతో 30 తాత్కాలిక మరుగుదొడ్లు, త్రాగునీరు, షవర్, స్నానాలు ఘట్టాలు ఏర్పాటు చేస్తున్నారు.