Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వృద్ధుడికి కౌన్సెలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగింత
నవతెలంగాణ-శాయంపేట
కుటుంబ సభ్యులతో వచ్చిన కలహాలతో మనస్థాపం చెందిన వృద్ధుడు బత్తుల లక్ష్మయ్య ఆత్మహత్య చేసుకోవడానికి దేవుని చెరువు సమీపంలోకి వెళ్ళాడు. విషయం తెలుసుకున్న ఎస్ఐ ఇమ్మడి వీరభద్రరావు ఘటనా స్థలానికి చేరుకొని అతనికి కౌన్సిలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించి మానవత్వాన్ని చాటుకున్నాడు. వివరాల్లోకి వెళితే... శాయంపేట గ్రామానికి చెందిన బత్తుల లక్ష్మయ్య మర మగ్గం పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. కొంతకాలంగా పక్షవాతం రావడంతో ఇంటి వద్దనే ఉంటూ ప్రభుత్వం అందజేసే పింఛన్తో జీవిస్తున్నాడు. కుటుంబ సభ్యుల మధ్య గొడవ జరగడంతో మనస్థాపం చెందిన లక్ష్మయ్య దేవుని చెరువులో పడి ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధపడ్డాడు. నడవలేని స్థితిలో మండుటెండలో ఒంటరిగా దేవుని చెరువు వైపు వెళుతుండటంతో గమనించిన వారు ఎటు వెళ్తున్నావని ప్రశ్నించడంతో కుటుంబ సభ్యులు తిట్టారని, చావడానికి వెళ్తున్నాని తెలియజేశాడు. లక్ష్మయ్యను ఆపేందుకు ప్రయత్నించిన వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ దుర్భాషలాడాడు. దీంతో పోలీసులకు సమాచారం అందించడంతో వెంటనే స్పందించిన ఎస్సై ఇమ్మడి వీరభద్రరావు చేరుకొని అతనికి కౌన్సెలింగ్ ఇచ్చారు. చావుతో సమస్య పరిష్కారం కాదని, ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కరిస్తారని భరోసా ఇచ్చారు. కుటుంబ సభ్యులను పిలిపించి వారికి అప్పగించి ఆటోలో ఇంటికి పంపించి వేశాడు. ఆత్మహత్య చేసుకోబోయిన లక్ష్మయ్యను మానవతా దక్పథంతో కాపాడిన ఎస్సై వీరభద్రరావును స్థానిక ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు అభినందించారు.