Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బిల్లు కోసం ఈజీఎస్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు
బిల్లు చెల్లించి ఆదుకోవాలని బాధితుడి వేడుకోలు
నవతెలంగాణ-శాయంపేట
'ఉపాధి హామీ పథకంలో గొర్రెల షెడ్డు నిర్మాణం కోసం అప్పులు తెచ్చి నిర్మాణం పూర్తి చేసి ఏడాది గడుస్తున్నా బిల్లు చెల్లించకపోవడంతో, బిల్లు కోసం ఈజీఎస్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాడు. బిల్లు చెల్లించి ఆదుకోవాలి' అని బాధితుడు భూషబోయిన సందీప్ అధికారులను వేడుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే... మండలంలోని తాహారాపూర్ గ్రామానికి చెందిన భూషబోయిన సందీప్ కులవత్తిలో భాగంగా గొర్రెలు, మేకల పెంచేవారు. ఉపాధి హామీలో గొర్రెల షెడ్లు మంజూరు చేస్తున్నారని తెలుసుకొని గ్రామపంచాయతీ పాలకవర్గం సహకారంతో షెడ్డు నిర్మాణానికి తీర్మానం చేసి ఉపాధి హామీ కార్యాలయంలో అందజేశారు. ఉపాధి సిబ్బంది ఆదేశాల మేరకు 2020లో పనులు ప్రారంభించారు. షెడ్డు నిర్మాణానికి ఈజీఎస్ నుంచి రూ.లు 90వేలు మంజూరు చేస్తారని ఆశతో పనులు ప్రారంభించగా.. షెడ్డు నిర్మాణానికి మూడు లక్షలకు పైగా ఖర్చు అయ్యిందని బాధితుడు తెలిపారు. అప్పులు తెచ్చి ఎట్టకేలకు షెడ్డు నిర్మాణం జనవరి 2021లో పూర్తి చేశాడు. షెడ్డు నిర్మాణం పూర్తి కావడంతో బిల్లు కోసం ఉపాధి హామీ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాడు. నిర్మాణం పూర్తయి ఏడాది గడుస్తున్నా ఇప్పటివరకు అధికారులు బిల్లు చెల్లించకపోవడంతో తెచ్చిన అప్పుకు వడ్డీలు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఇప్పటికైనా అధికారులు స్పందించి షెడ్డు నిర్మాణానికి మంజూరైన నిధులు వెంటనే చెల్లించి ఆదుకోవాలని బాధితుడు వేడుకుంటున్నాడు.