Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఎన్జీఓస్ కాలనీ
ఎల్ఐసీ అంటే నమ్మకమని.. బీజేపీ అంటే ప్రభుత్వ రంగ సంస్థ అమ్మకమని ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్యే దాస్యం వినరుభాస్కర్ అన్నారు. హనుమకొండ బాలసముద్రంలోని ఎల్ఐసీ డివిజనల్ కార్యాలయంలో ఆ సంస్థ 35వ వార్షికోత్సవ సందర్భంగా ఆదివారం నిర్వహించిన కౌన్సిల్ సమావేశానికి విశిష్ట అతిథిగా వినరుభాస్కర్ హాజరై మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలు అవలంభిస్తోందని విమర్శించారు. ఎల్ఐసీని నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతోందని ఆందోళన వెలిబుచ్చారు. ఎల్ఐసీలో ఐపీఓలకు వ్యతిరేకంగా తలపెట్టిన పోరాటాలకు టీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. సమావేశానికి ముఖ్యఅతిథిగా సీనియర్ డివిజనల్ మేనేజర్ థామర్ హాజరై మాట్లాడారు. ఎల్ఐసీలో వాటాల విక్రయాన్ని వ్యతిరేకించాలని కోరారు. దేశ ఆర్థిక స్వావలంబనలో ఎల్ఐసీ కీలక పాత్ర పోషిస్తోందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం దేశీయ, విదేశీ పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం ప్రజల ఆస్తులను కారుచౌకగా విక్రయిస్తోందని విమర్శించారు. ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సౌత్ సెంట్రల్ జోనల్ జనరల్ సెక్రటరీ టీవీఎంఎస్ రవీంద్రనాథ్, జాయింట్ సెక్రెటరీ తిరుపతయ్య మాట్లాడుతూ దేశ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపర్చడంలో ప్రభుత్వ రంగ సంస్థలు ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రయివేటీకరించడమే కాకుండా ఐపీఓల పేరుతో ఎల్ఐసీని అమ్మేయడానికి, సాధారణ బీమా సంస్థలను ప్రయివేటుపరం చేయడానికి అనేక చర్యలు చేపట్టిందని విమర్శించారు. ఎల్ఐసీలో 5 నుంచి 10 శాతం వాటాను ఉపసంహరించుకుని తద్వారా లక్ష కోట్ల సేకరణకు ప్రభుత్వం యోచిస్తుండడం దారుణమన్నారు. ద్రవ్య లోటును పూడ్చుకోవడం కోసం లాభదాయకమైన ప్రభుత్వ రంగ సంస్థలను విక్రయించడం ద్వారా 1.75 లక్షల కోట్లను సమీకరించాలనే డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యంలో భాగంగా లక్ష కోట్ల రూపాయల ఎల్ఐసీ వాటాలను విక్రయించడం ద్వారా సేకరించాలని ప్రభుత్వం భావిస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వ రంగ బీమా సంస్థల ప్రయివేటీకరణను ఆపాలని డిమాండ్ చేశారు. అత్యుత్తమమైన ప్రభుత్వ రంగ ఆర్థిక దిగ్గజ సంస్థలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపైనా ఉందన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ అధ్యక్షుడు జి ప్రభాకర్‌రెడ్డి, ఐసీఈయూ అధ్యక్షుడు ప్రభాకర్, జనరల్ సెక్రటరీ జగదీశ్వర్, తదితరులు పాల్గొన్నారు.