Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మట్టెవాడ
గుడిసె వాసులకు వెంటనే పట్టాలు ఇవ్వాలని సీపీఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు తోట భిక్షపతి డిమాండ్ చేశారు. పొడిశెట్టి సరళ అధ్యక్షతన మంగళవారం ఎల్వీఆర్ నగర్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం మాటల గారడీతో పబ్బం గడుపు తోందన్నారు. నిధులు, నియామకాలు, నీళ్లు పేరుతో సాధించుకున్న తెలంగాణలో నియంత పాలన కొనసాగు తోందని విమర్శించారు. జీవో నెంబరు 58, 59 ప్రకారం గుడిసెవాసులకు పట్టాలు ఇవ్వాల్సి ఉండగా, నేటికీ అతీగతీ లేదని మండిపడ్డారు. పట్టాలు ఇచ్చేంత వరకూ సమరశీల ఉద్యమాలు నిర్వహిస్తామన్నారు. గుడిసెవాసులకు పట్టాల కోసం తహశీల్దార్ కార్యాలయ ఎదుట బుధవారం నిర్వహించే ధర్నాను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కార్యదర్శి బుస్సా రవీందర్, సీపీఐ నాయకులు, గుడిసెవాసులు తదితరులు పాల్గొన్నారు.