Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తాడ్వాయి:
మేడారంలో సమ్మక్క-సారలమ్మకు నేడు (బుధవారం) తిరుగువారం పండుగను ఘనంగా నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 16 నుంచి 19వ తేదీ వరకు జరిగిన మహా జాతర తల్లుల వనప్రవేశంతో ముగిసిన విషయం తెలిసిందే. గుడిమెలిగె పండుగ నుంచి తల్లుల వనప్రవేశం అయ్యేంత వరకు పూజ కార్యక్రమాలు నిర్వహించిన పూజారులు బుధవారం తిరుగు వారం పండుగ నిర్వహించనున్నారు. ఎన్నో వ్యయ ప్రయాసాలకు ఒర్చుకుని తల్లుల చెంతకు వచ్చిన మొక్కులు చెల్లించిన భక్తజనాన్ని, గ్రామస్తులను చల్లంగా చూడాలని, పాడి పంటలు సమద్ధిగా పండాలని ఈ తిరుగువారం పండుగ సందర్భంగా దేవతలను వేడుకోనున్నారు. ఈ పండుగ సందర్భంగా దేవతలను మొక్కులు చెల్లించేందుకు భక్తులు తరలిరానున్నారు.
మేడారంలోని సమ్మక్క గుడిలో సమ్మక్క పూజారులు తిరుగువారం పండుగా నిర్వహిస్తారు. సమ్మక్క తల్లికి ధూప, దీపాలతో ఈ సందర్భంగా వారు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. కన్నెపల్లి సారలమ్మ ఆలయంలో కూడా పూజారులు తిరుగువారం పండుగను నిర్వహిస్తారు. ప్రధాన పూజారి కాక సారయ్య అమ్మవారి వస్త్రాలు, పూజ సామగ్రిని శుద్ధి చేస్తారు. వడెరాల కుండాలను పసుపు, కుంకుమలతో అలకరిస్తారు. సారలమ్మకు ధూప, దీపాలతో పూజలు నిర్వహిస్తారు. తిరుగువారం పండుగతో తల్లుల పూజలు ముగిస్తాయి. మహా జాతరలో తల్లుల సేవలో తరించిపోయిన పూజారులు తిరుగువారం పండుగ పూజల అనంతరం మళ్లీ ఏడాది మధ్యలో నిర్వహించే మినీ జాతర వరకు స్యాధారణ వ్యక్తులుగా మారిపోతారు.