Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జీపీ ఉద్యోగ, కార్మిక సంఘాల జేఏసీ నాయకుల వినతి
నవతెలంగాణ-నర్సంపేట
గ్రామ పంచాయతీలలో పనిచేస్తున్న ఉద్యోగ, కార్మికులకు జీఓ 60 ప్రకారం వేతనాలను చెల్లించాలని తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్, వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాగంటి వెంకటయ్య అన్నారు. మంగళవారం జీపీ ఉద్యోగ, కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. తెలంగాణ రాష్ట్రంలో వివిధ శాఖలు, కార్పొరేషన్లలో అన్ని తరగతుల ఉద్యోగులకు ప్రభుత్వం వేతనాలు పెంచారన్నారు. చివరకు స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకు కూడా వేతనాలు పెంచారన్నారు. నిత్యం ప్రజలకు కనీస సౌకర్యాలను కల్పిస్తున్న గ్రామపంచాయతీ కార్మిక, సిబ్బందికి వేతనాల పెంపుపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. జీఓ నెంబరు 60 ప్రకారం వివిధ శాఖల్లో పనిచేసే ఉద్యోగులకు జూన్ నెల 2021 నుంచి పెంచిన వేతనాలు వర్తింపజేసిందని తెలిపారు. ఇదే జీఓ ప్రకారం గ్రామపంచాయతీలో పనిచేస్తున్న సిబ్బందికి కూడా వేతనాలు పెంచాల్సిన అవసరం ఉందన్నారు. జీఓ నెంబర్ 51ని సవరించాలని, మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేయాలని, కారోబార్, బిల్ కలెక్టర్లకు ప్రత్యేక హౌదా కల్పించాలన్నారు. పీఎఫ్, ఈఎస్ఐలతో పాటు బీమా సదుపాయాలను కల్పించాలన్నారు. జీపీ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించడానికి వచ్చే బడ్జెట్ సమావేశాలలో సమస్యలను ప్రస్తావించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు.
సీఐటియు జిల్లా కన్వీనర్ అనంతగిరి రవి మాట్లాడుతూ.. రాష్ట్రంలో దళిత ఎంపవర్మెంట్ సమావేశంలో సీఎం పీఆర్సీ ప్రకారం వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చాడని, కానీ ఇప్పటికీ వేతనాలు పెంచడానికి చర్యలు చేపట్టకపోవడం అన్యాయమన్నారు. వెంటనే జీపీ కార్మికులకు వేతనాలు పెంచాలని, లేకుంటే ఆందోళనలు ఉధృతం చేయాల్సి వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ బ్రహ్మచారి, జిల్లా ఉపాధ్యక్షులు అశోక్, జిల్లా నాయకులు జిల్లా కోశాధికారి జిల్లా నాయకులు భూక్య నరేష,్ కుమారస్వామి, శ్రీరాము, బిక్షపతి, అశోక్ రెడ్డి రాజు, యాకయ్య తదితరులు పాల్గొన్నారు.