Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆర్థిక వృద్ధి చెందినప్పుడే దళిత బంధు సక్సెస్
వారం రోజుల్లో లబ్ధిదారుల ఖాతాలో డబ్బులు
కలెక్టర్ గోపి
నవతెలంగాణ-రాయపర్తి
దళిత బంధు పధకాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకొని ఆదర్శానికి చిరునామాగా కిష్టపురం గ్రామాని నిలబెట్టాలని వరంగల్ కలెక్టర్ బీ గోపి అన్నారు. మంగళవారం స్థానిక ఎంపీపీ కార్యాలయంలో జిల్లా షెడ్యూల్ కులాల సేవా సహకార అభివద్ధి సంఘం వరంగల్ వారి ఆధ్వర్యంలో దళిత బంధు లబ్ధిదారులతో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని దళితబంధు పథకాన్ని తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. దళిత బంధు పథకానికి ఆంక్షలు లేవని, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారై ఉంటే చాలన్నారు. దశలవారీగా దళిత బంధు పథకాన్ని అమలు చేయనున్నట్టు పేర్కొన్నారు.
మండలంలోని కిష్టపురం గ్రామాన్ని మోడల్ ప్రాజెక్టు క్రింద ఎంపిక చేసి దళిత బంధు పథకాన్ని అమలు చేయనున్నట్టు తెలిపారు. గ్రామంలో 41ఎస్సీ కుటుంబాలు ఉన్నప్పటికీ.. మొదటి విడతలో 20 కుటుంబాలకు మాత్రమే దళిత బంధు ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు. లబ్ధిదారులు పూర్తిస్థాయిలో అవగాహన ఉన్న వ్యాపారం ఎంపిక చేసుకోవాలని సూచించారు. ఒక్క యూనిట్ పది లక్షలు ఉన్నందున చిన్న చిన్న యూనిట్ల ఏర్పాటు చేసుకొని వ్యాపారం చేసుకునే వెసులుబాటు ఉందన్నారు. లబ్ధిదారులు సొంత గ్రామంలోనే కాకుండా.. మండల కేంద్రంతో పాటు జిల్లా కేంద్రాల్లో కూడా వ్యాపారం చేసుకోవచ్చునన్నారు. వారం రోజుల్లో లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ చేయనున్నట్టు చెప్పారు. మార్చి వరకు పూర్తిస్థాయిలో దళిత బంధు పథకాన్ని అమలు చేస్తామన్నారు.
లబ్ధిదారులు ఆర్థికంగా ఎదిగినప్పుడే దళిత బంధు సక్సెస్ అయిన్నట్టని వ్యాఖ్యానించారు. రెండవ దశలో నియోజకవర్గానికి రెండు వేల యూనిట్లు రానున్నట్టు తెలియజేశారు. గ్రామంలో, మండల స్థాయిలో ఎస్సీ యూత్ కమిటీలు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సురేష్, అదనపు కలెక్టర్ హరి సింగ్, ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, జెడ్పీటీసీ రంగు కుమార్, ఎంపీడీఓ కిషన్ నాయక్, తహశీల్దార్ సత్యనారాయణ, ఏఓ వీరభద్రం, సర్పంచులు గారె నర్సయ్య, సంకినేని ఉప్పలమ్మ, ఎంపిఓ రాంమ్మోహన్, ఏపీఓ కుమార్, రైతు బంధు మండల కోఆర్డినేటర్ సురేందర్ రావు, ఎంపీటీసీలు బిల్లా రాధిక సుభాష్ రెడ్డి, ఐత రాంచందర్ పాల్గొన్నారు.